అందుకే మా నాన్నంటే అసూయ: మంచు విష్ణు

డైలాగ్‌ కింగ్‌ మోహన్ ‌బాబు మంచు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. విలన్‌గా ఆయన వేసే పంచ్‌ డైలాగులకు అభిమానులు ఫిదా అవుతుంటారు. హీరోగా ఎంతటి భారీ, పవర్‌పుల్‌ డైలాగ్‌నైనా అలవోకగా చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తారు. అలా డైలాగ్‌ కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ‘పెద్దరాయడు’, ‘రాయలసీమ రామన్న చౌదరి’, ‘అడవిలో అన్న’ వంటి చిత్రాల్లో నాయకుడి పాత్ర పోషించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ సినిమాల్లో ఆయన చెప్పే ఒక్కొక్క పవర్‌పుల్ డైలాగ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటి తరం వారు సైతం ఆయన డైలాగ్‌ డెలివరిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అంతేగాక అచ్చం ఆయలా చేయడానికి ఆసక్తిని చూపుతారు.

అలా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు గత నెల నవంబర్‌లో 45 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, హీరో మంచు విష్ణు తన తండ్రి పవర్‌పుల్‌ డైలాగ్‌ను పంచుకున్నారు. మోహన్‌బాబు నటించిన ‘అడవిలో అన్న’ చిత్రంలోని పాపులర్‌‌ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ గురువారం ట్వీటర్‌లో షేర్‌ చేశారు. ‘ఆయన నటించిన సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమా, డైలాగుల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో ఆయన డైలాగ్‌ చెప్పే విధానం, ఆయన మ్యానరీజం చూసినప్పుడల్లా నాకు అసూయగా ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోసారి డైలాగ్‌ కింగ్‌ సినిమాలను గుర్తు చేసుకుంటూ ఆయనపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.