అకీరా నందన్ కి తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అలవాటు చేస్తున్నాడా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని తనయుడు కొనసాగించే దిశగా 20 ఏళ్ల వయసులోనే పునాది వేస్తున్నాడా? అంటే అవుననే సందేహాలు రావడం సహజమే. ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వెంట కుమారుడు అకీరానందన్ ని తిప్పుకుంటోన్న వైనం చూస్తుంటే? అందరికీ అలాగే అనిపిస్తుంది. నిన్న కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరకు అకీరాను స్వయంగా తానే తీసుకెళ్లి పరిచయం చేసి ఆశీర్వదించమని కోరారు.
అటుపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన కాళ్లకు అకీరా నమస్కరించి ఆశీర్వాదాలు అందుకున్నాడు. ఈ రెండు సన్నివేశాల్లో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. సినిమా నటుడో..సంగీత దర్శకుడో అవుతాడు అనుకున్న అకీరాని రాజకీయ నాయకుడిని చేస్తున్నాడా? అంటూ అంతా చర్చించుకుం టున్నారు. ఇంతవరకూ ఏ సినిమా వేదికపైనా అకీరాని స్వయంగా పవన్ కళ్యాణ్ హైలైట్ చేసింది లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ అయినా ఏనాడు కుమారుడిని షూటింగ్ సెట్స్ కి తీసుకెళ్లింది లేదు.
దర్శకుల్ని పరిచయం చేసింది లేదు. నిర్మాతలతో సాన్నిహిత్యాన్ని పెంచింది లేదు. తన జనరేషన్ హీరోలకు కూడా స్వయంగా చేసింది. లేదు. వాస్తవానికి పవన్ కళ్యాణ సినిమాల్లోకి రావడం అన్నదే యాధృశ్చి కంగా జరిగింది. కానీ రాజకీయాల్లోకి మాత్రం ఎంతో ఆసక్తిగానే ఎంట్రీ ఇచ్చారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి కూటమితో కలిసి గెలిచేవరకూ అవిశ్రామ పోరాటమే చేసారు. రాజకీయాలపై ఎంతో ఫ్యాషన్ ఉంటే తప్ప సాధ్యం కాని పని ఇది.
ప్రజల మధ్య తిరిగాడు..ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు. సామాజిక మార్పు కోరుకుంటున్నాడు. చంద్రబాబు పక్కన చేరి రాజకీయ వ్యూహాలు నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు తన రాజకీయ అనుభవాలన్నింటిని ఇప్పటి నుంచే తనయుడికి నేర్పించే క్రమంలోనే ఇలాంటి ఎంట్రీ ఇప్పించారు? అన్నది అందరిలో జరుగుతోన్న చర్చ. అలాగే అకీరా కి హీరో అవ్వడం కంటే మ్యూజిక్ రంగంలో రాణించాలనే కోరిక బలంగా ఉంది. అతడి వయసు 20 ఏళ్లే. కానీ పవన్ తీరు చూస్తుంటే? వచ్చే ఎన్నికలకు అకీరా ని కూడా పొలిటికల్ బరిలోకి దించేలా కనిపిస్తుంది.
2029కి అకీరా వయసు 25 ఏళ్లు. తెలివైన కుర్రాడు. తల్లి చాటు బిడ్డ అయినా తండ్రిలా తెగింపు ఉంటుందనే అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి. యువత కూడా రాజకీయాల్లోకి రావాలని పవన్ ఎన్నోసందర్భాల్లో పిలుపు నిచ్చారు. భావితరాల భవిష్యత్ బాగుపడలంటే రాజకీయ వ్యవస్థ మారాలని బలంగా కోరుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి యువతని వెతుకు పట్టుకోవడం అంత సులభం కాదు. బలమైన క్యాడర్ ఉండాలి.
ఇక నుంచి పవన్ ఆ అంశంపైనే దృష్టి పెట్టి పనిచేస్తారు. 2029 ఎన్నికలకు 175 నియోజక వర్గాల్లో పోటీ చేసేలా సన్నధం అవుతారు. ఇలాంటి సమయంలో తండ్రి పక్కన తనయుడు అవసరం కూడా అంతే ఉంది. అసలే రాజకీయాల్లో అందర్నీ నమ్మలేని పరిస్థితి. మరి ఇలాంటి వాటన్నింటిని విశ్లేషించుకుని అకీరాని ఇలా రాజకీయ నాయకుల మధ్యలో తిప్పుతున్నారా? లేక గెలిచిన ఉత్సాహంలో తిప్పుతున్నారా? అన్నది అతి త్వరలోనే క్లారిటీ వస్తుంది.