బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ తన పాలి హిల్ (బాంద్రా, ముంబై) బంగ్లాను విక్రయించినట్లు సమాచారం. ప్రఖ్యాత జాప్ కీ నివేదిక ప్రకారం.. ఇటీవల ఈ వివాదాస్పద ఆస్తిని 32 కోట్ల రూపాయలకు విక్రయించిందని తెలిసింది. కంగనా సెప్టెంబర్ 2017లో రూ. 20.7 కోట్లతో ఆస్తిని కొనుగోలు చేసిందని సమాచారం. డిసెంబర్ 2022లో ఆస్తిపై ఐసిఐసిఐ బ్యాంక్ నుండి రూ. 27 కోట్ల రుణాన్ని కూడా తీసుకుంది. ఈ బంగ్లాను నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ కార్యాలయంగా ఉపయోగించారు.
గత నెలలో కోడ్ ఎస్టేట్ అనే యూట్యూబ్ పేజీ కూడా ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్ అమ్మకానికి ఉందని వెల్లడించే వీడియోను షేర్ చేసింది. ప్రొడక్షన్ హౌస్ పేరు , యజమాని పేరు వెల్లడించనప్పటికీ వీడియోలో ఉపయోగించిన ఫోటోలు, విజువల్స్ అది కంగనా కార్యాలయం అని క్లారిటీనిచ్చాయి. ఇది కంగనా ఇల్లు అని ఊహిస్తూ పలువురు నెటిజనులు కామెంట్లు చేసారు. ఆస్తి చదరపు మీటర్ల భూమితో వస్తుందని ఈ వీడియో వెల్లడించింది. ప్లాట్ సైజు 285 చదరపు మీటర్లు. నిర్మాణ విస్తీర్ణం 3042 చదరపు అడుగులు. ఇల్లు 500 చదరపు అడుగుల అదనపు పార్కింగ్ స్థలం కూడా కలిగి ఉంది. ఈ భవనం రెండు అంతస్తులు ధర రూ. 40 కోట్లకు కోట్ చేసారు.
2020లో బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బిఎంసి) ఈ ఆస్తిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. 2020 సెప్టెంబర్‌లో ఇది అక్రమ నిర్మాణం అని పేర్కొంటూ ఈ భవంతిలోని కంగనా కార్యాలయ భాగాలను కూల్చివేసింది. సెప్టెంబరు 9న బాంబే హైకోర్టు నుండి స్టే ఆర్డర్‌తో కూల్చివేత పనులు మధ్యలో ఆగిపోయాయి. కంగనా బీఎంసికి వ్యతిరేకంగా కేసు దాఖలు చేసింది.బీఎంసీ నుండి పరిహారం కోసం రూ. 2 కోట్లు డిమాండ్ చేసింది. కానీ మే 2023లో ఆమె డిమాండ్‌లను విరమించుకుంది.
కంగనా రనౌత్ తన సినిమా ఎమర్జెన్సీ విడుదల కోసం ఎదురుచూస్తున్న సమయంలో బంగ్లా అమ్మకం జరిగింది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డ్ నుండి సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నందున వాయిదా పడింది. ఎమర్జెన్సీ బాయ్‌కాట్‌లు, బ్యాన్ కాల్‌లను ఎదుర్కొంటోంది. ఈ చిత్రం సమాజాన్ని తప్పుగా చూపిందని పలు సిక్కు సంస్థలు ఆరోపించాయి. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (SGPC).., అఖల్ తఖ్త్ కూడా ఈ సినిమాపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశాయి. సిక్కులకు వ్యతిరేకంగా కథనాన్ని సృష్టించడం ద్వారా `పాత్ర హత్య` చేయడానికి ఈ సినిమా ప్రయత్నిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం ఎమర్జెన్సీకి క్లియరెన్స్ రావాల్సి ఉంది.