అతడి జీవితానికి ఆ ఒక్క సినిమా చాలు

గుల్షన్ గ్రోవర్ హత్య.. దివ్య భారతి ఆత్మహత్య (?).. జియా ఖాన్ సుసైడ్.. ఇలా బాలీవుడ్‌ గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నో షాక్‌లు తింది. ఇప్పుడు ఎదురైన షాక్ వాటికి ఏమాత్రం తీసిపోనిది. బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడు.. మంచి నటుడిగా గుర్తింపు సంపాదించి, ఎంతో భవిష్యత్తు ఉందనుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ ఆత్మహత్యకు పాల్పడటం విస్మయాన్ని కలిగించేదే.

ఆ స్థాయిలో ఉన్న హీరో ఇలా చేసుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండురు. అతడికి అంత కష్టం ఏం వచ్చిందో అంతు బట్టట్లేదు. కొన్ని రోజుల కిందటే సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడున్న స్థితికి ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునే అవకాశముంది. మరి అంత తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందన్నది అర్థం కాని విషయం.

2013లో ‘కై పో చే’ సినిమాతో నటుడిగా పరిచయం అయిన సుశాంత్.. ఈ ఏడేళ్లలో చేసింది పది పన్నెండు సినిమాలే. కానీ నటుడిగా తొలి సినిమా నుంచే తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు. అతడి కెరీర్లో మిగతా సినిమాలన్నీ ఒకెత్తయితే.. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్.ధోని: ది అన్ టోల్డ్ స్టోరీ’ సినిమా మరో ఎత్తు.

ముందు అతణ్ని ఈ సినిమాకు హీరోగా ఎంచుకున్నారని అన్నపుడు.. ఇతను ధోనీగా ఏం సూటవుతాడు అన్నారంతా. కానీ అలా అన్న వాళ్లంతా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. మామూలుగా చూస్తే ధోనీని అనుకరించడం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది సుశాంత్‌.. ధోనీ నడక, హావభావాలు, బ్యాటింగ్ స్టైల్.. ఇలా అన్నింటినీ అచ్చుగుద్దినట్లు దించేశాడు. ధోనీలోని ప్రశాంతచిత్తాన్ని కూడా తెరపైకి తీసుకురాగలిగాడు. అతడి వ్యక్తిత్వం సైతం తెరపై కనిపించిందంటే అది సుశాంత్ ఘనతే.

ఈ పెర్ఫామెన్స్‌తో సుశాంత్ మీద మామూలుగా ప్రశంసలు కురవలేదు. ధోనీ అభిమానులందరూ అతడి అభిమానులైపోయారు. ఆ సినిమా అసాధారణ విజయం సాధించడంలో సుశాంత్ పాత్ర కీలకం. అందుకే ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య గురించి బయటపడగానే.. ధోని సినిమాకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.