అన్నట్లుగానే కోటిన్నర సాయం చేసిన స్టార్‌ హీరో

కరోనా కారణంగా ఉపాది లేక అల్లాడుతున్న సినీ కార్మికుల కోసం ఇప్పటికే చాలా మంది ప్రముఖులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. షూటింగ్స్‌ పూర్తి స్థాయిలో జరగని కారణంగా జూనియర్‌ ఆర్టిస్టులు డైలీ లేబర్‌ వేలాది మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో వారిని ఆదుకునేందుకు తన ఆకాశమే నీ హద్దురా సినిమాకు వచ్చే అయిదు కోట్లను విరాళంగా ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవలే ఆ విషయాన్ని ప్రకటించిన సూర్య అన్నట్లుగానే తాజాగా మొదటి విడతగా కోటిన్నర ఆర్థిక సాయంను అందించారు.

కోటిన్నరలో కోటి రూపాయలు సినీ కార్మికుల సమాఖ్య కోసం, 30 లక్షలు నిర్మాతల మండలికి, 20 లక్షలు నడిగర్‌ సంఘంకు ఇచ్చారు. సూర్య తండ్రి శివ కుమార్‌ స్వయంగా సినీ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆర్‌ కే సెల్వమణి మరియు నిర్మాతల మండలి చైర్మన్‌ కలైపులి ఎస్‌ థానులకు అందించారు. సినీ కార్మికుల కోసం సూర్య చేసిన సాయంపై ఆయన అభిమానులతో పాటు అంతా కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. వందల కోట్ల పారితోషికాలు తీసుకునే వారు సైలెంట్‌ గా ఉంటే మీరు మాత్రం సాయం చేస్తున్నారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇక సూర్య ఆకాశమే నీ హద్దురా సినిమా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమా మాత్రమే ఓటీటీలో అని తాను ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలను తప్పకుండా థియేటర్‌ లలో మాత్రమే విడుదల చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సూర్య తమ్ముడు కార్తీ కూడా ఇప్పటికే సినీ కార్మికుల కోసం సాయంను ప్రకటించిన విషయం తెల్సిందే.