అమ్మడు ఇకపై షష్టిపూర్తి హీరోలకి జోడీగా సెటిల్ అవుతుందా..?

విశ్వనటుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గార్జియస్ బ్యూటీ శృతి హాసన్.. హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నప్పటికీ.. తర్వాత రోజుల్లో బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకొని లక్కీ చార్మ్ అనిపించుకుంది.

‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శృతి.. మహేష్ బాబు – పవన్ కల్యాణ్ – ఎన్టీఆర్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – నాగచైతన్య వంటి హీరోలతో కలిసి నటించింది. ఈ క్రమంలో కొన్నేళ్ళపాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాణించింది.

అయితే ‘కాటమ రాయుడు’ తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించేసిన శృతి హాసన్.. ‘క్రాక్’ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలో వెంటనే ‘వకీల్ సాబ్’ చిత్రంతో పలకరించింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ వస్తోంది.

శ్రుతి ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన “సలార్” అనే సినిమాలో నటిస్తోంది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ఆధ్య అనే పాత్రలో శృతి నటిస్తోంది.

షూటింగ్ దశలో ఉన్న ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా హిట్టయితే శ్రుతి కి నేషనల్ వైడ్ మంచి క్రేజ్ దక్కుతుంది. కాకపొతే ‘సలార్’ కంటే ముందుగా మరో రెండు భారీ తెలుగు చిత్రాలతో పలకటించబోతోందీ క్రాక్ బ్యూటీ.

కొల్లి రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న “వాల్తేరు వీరయ్య” సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ చేస్తున్న “వీర సింహా రెడ్డి” చిత్రంలో శ్రుతి కథానాయికగా నటిస్తోంది.

ఇలా శ్రుతి హాసన్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఇద్దరు షష్టిపూర్తి హీరోలకు జోడీగా కనిపించబోతోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఈసారి ఒకేసారి సూపర్ సీనియర్లతో జత కట్టింది. ఇక్కడ మరో ఆసక్తికమైన విషయం ఏంటంటే.. ఆమె హీరోయిన్ గా నటించిన ఈ రెండు సినిమాలూ 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి.

వాల్తేరు వీరయ్య – వీర సింహా రెడ్డి సినిమాలలో శ్రుతి తన తండ్రి కమల్ హాసన్ కి సమకాలీనులైన చిరంజీవి – బాలయ్య లకు జోడీగా ఎలా కనిపిస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రెండు చిత్రాల నుంచి ఆమె ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చెయ్యలేదు.

శ్రుతి ఇటీవల కాలంలో కాస్త బక్కచిక్కి పోయినా.. పవన్ కళ్యాణ్ – రవితేజ వంటి హీరోలకు బాగానే సెట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు సూపర్ సీనియర్ల సరసన ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాల తర్వాత శృతి హాసన్ కు యంగ్ హీరోల పక్కన నటించే అవకాశాలు వస్తాయా? ఇకపై సీనియర్ హీరోలకు జోడీగా చేయాల్సిందేనా? అనేది చూడాలి.