కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బీకు బైక్స్ అన్నా బైక్ రైడింగ్ అన్నా అమితమైన ఇష్టమనే విషయం తెలిసిందే. స్వతహాగా అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బైకులు కలిగి ఉన్న అజిత్.. బైక్ పై రోడ్ ట్రిప్ కు వెళ్తుంటారు.కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా హైదరాబాద్ నుంచి చెన్నైకి బైక్ పై ప్రయాణించారు అజిత్. షూటింగ్స్ కోసం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా బైక్ పై విహరించడం అగ్ర హీరోకి అలవాటు. అజిత్ బైక్ రైడింగ్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి.
అజిత్ తాజాగా రోడ్ ట్రిప్ కు వెళ్లారు. ఈసారి ఏకంగా విశాఖపట్నం నుంచి నేరుగా హిమాలయ పర్వత ప్రాంతాలకు బైక్ పై వెళ్ళారు. ఆయన వెంట కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కౌన్సిలర్ సెంథిల్ తో పాటుగా పలువురు స్నేహితులు కూడా ఉన్నారు.
ఇటీవల ఫ్యామిలీతో ఐరోపా దేశాలు చుట్టి వచ్చిన అజిత్.. తిరిగి రాగానే తాను నటిస్తున్న #AK61 మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ విశాఖలోని అరకు ప్రాంతంలో జరుగుతోంది. అజిత్ తన షూటింగ్ ను పూర్తి చేసి అటునుంచి అటే తన బృందంతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.
బైక్ పై సుదీర్ఘ ప్రయాణంలో ముందుగా లడక్ చేరుకున్న అజిత్ బృందం.. అటు నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. హిమాలయాల్లో వారం పాటు బైక్ రైడింగ్ చేసి ఆ తర్వాత చెన్నైకి తిరిగి వస్తారని తెలుస్తోంది. అనంతరం మళ్లీ సినిమా షూటింగ్ తో బిజీ కానున్నారు.
AK61 చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ‘నెర్కొండ పార్వై’ ‘వలిమై’ తర్వాత వీరి ముగ్గురి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో ‘బిల్లా’ ‘గ్యాబ్లింగ్’ తరహా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్ కనిపించనున్నారని టాక్.
హీస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అజిత్ కుమార్ సరసన మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తోంది. తదుపరి షెడ్యూల్ కోసం టీమ్ అంతా బ్యాంకాక్ వెళ్తున్నట్లు సమాచారం. అక్కడ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ మరియు బైక్ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దీంతో 85 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది.
AK61 సినిమాని అక్టోబర్ నాటికి పూర్తి చేసి 2023 పొంగల్ బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీని తర్వాత విగ్నేష్ శివన్ దర్శకత్వంలో అజయ్ తన 62వ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది. ఇందులో ఐశ్వర్య రాయ్ బచ్చన్ హీరోయిన్ గా నటించనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలుగులో క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు ఇక్కడ కూడా డబ్ కాబడి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. అజిత్ నుంచి రాబోయే రెండు సినిమాలు కూడా తెలుగులో విడుదల కానున్నాయి.