అలాంటి మహేష్ బాబు మళ్ళీ తిరిగొస్తే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ దర్శక హీరోల కెరీర్ లోనే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే భారీ ప్రాజెక్ట్ గా మారబోతోంది. దీంతో గ్లోబల్ బాక్సాఫీస్ షేక్ అవ్వడం గ్యారంటీ అని మహేశ్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే వాళ్లు ఇలాంటి సినిమా కోసమే చాలా కాలంగా వేచి చూస్తున్నారు.

నిజానికి మహేశ్ బాబు గత ఆరేళ్ల నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ ‘సర్కారు వారి పాట’ ‘గుంటూరు కారం’ వంటి బ్యాక్ టూ బ్యాక్ ఆరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. డబుల్ హ్యాట్రిక్ కొట్టినా సరే, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం నూటికి నూరుశాతం హ్యాపీగా ఉండలేకపోతున్నారు. దీనికి కారణం వారంతా ఒకప్పటి తమ అభిమాన హీరోని మిస్ అవుతున్నారు. అంతేకాదు ఇవన్నీ తమ హీరో రేంజ్ సినిమాలు కాదనేది వారి అభిప్రాయం.

మహేశ్ గతంలో ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలతో తనలోని మాస్ యాంగిల్ ను చూపించి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. అయితే 1-నేనొక్కడినే, స్పైడర్ వంటి ప్రయోగాత్మక చిత్రాలు ఫ్లాప్ అయిన తర్వాత పూర్తిగా రూట్ మార్చారు. మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్స్, సబ్టిల్ రోల్స్ ఎంచుకుంటూ వస్తున్నారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫామ్ చేసినప్పటికీ, ఫ్యాన్స్ మాత్రం వింటేజ్ మహేశ్ బాబులోని మాస్ ను మాత్రమే కోరుకుంటున్నారు.

మహేశ్ పవర్ ఫుల్ యాక్షన్ టచ్ తో కూడిన మాస్ సబ్జెక్ట్స్, హై ఆక్టేన్ యాక్షన్ మూవీస్ చెయ్యాలనేది అభిమానుల అభిలాష. త్రివిక్రమ్ తో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆ లోటుని భర్తీ చేస్తుందని భావించారు. కానీ అది కూడా ఏకగ్రీవంగా అందరినీ మెప్పించలేకపోయింది. అందుకే పక్కా మాస్ కమర్షియల్ బొమ్మ పడితే ఆయన స్టామినా ఎంతో బాక్సాఫీస్ కు చూపిస్తారని భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు కచ్ఛితంగా రాజమౌళి సినిమాతో తమ ఆశలన్నీ నెరవేరుతాయని ధీమాగా ఉన్నారు.

మహేశ్ బాబు కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావరేజ్ కంటెంట్ తో వచ్చినా, బాక్సాఫీసు రికార్డులు పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 9న ఆయన బర్త్ డే స్పెషల్ గా ‘మురారి’ మూవీని రీ-రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక క్లాస్ మూవీ. అయినప్పటికీ ప్రీ సేల్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేస్తే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నాన్ కమర్షియల్ సినిమా రీరిలీజ్ కే ఇలాంటి రెస్పాన్స్ వస్తోందంటే.. వింటేజ్ మాస్ మహేష్ తిరిగొచ్చి, ఫ్యాన్స్ ఆశించే సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. మరి ఇకపై సూపర్ స్టార్ ఇకపై అన్నీ అభిమానులు కోరుకునే చిత్రాల్లోనే నటిస్తారేమో చూడాలి.