మెరుపులా దూసుకొచ్చిన మెగా మేనల్లుడు సాయితేజ్ ఒక్కసారిగా వేగం తగ్గిన వైనం ఆ తర్వాత పెరిగిన వేగం గురించి తెలిసిందే. ‘విరూపాక్ష’తో భారీ విజయం అందుకుని 100 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ వెంటనే ‘బ్రో ‘తో మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నారు. ఇలా రెండు విజయాలు మెగా అల్లుడుకి మంచి బూస్టింగ్ నిచ్చాయి. అంతకు ముందు వరుస పరాజయాలు..యాక్సిడెంట్ తో సాయితేజ్ ఎలాంటి బ్యాడ్ ఫేజ్ ని ఫేస్ చేసాడో తెలిసిందే.
ఈ సమయంలో ‘బ్రో’ సినిమా రావడం..అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్ర పోషించండో అల్లుడికి మంచి బూస్టింగ్ లా కనిపించింది. అంత వరకూ అల్లుడు వెనుక అప్పుడప్పడు చిరంజీవి సహకారం తప్ప మిగతా వారి సపోర్ట్ పెద్దగా కనిపించలేదు. బ్యాకెండ్ లోఉన్నా నేరుగా ముందుకొచ్చి ప్రమోట్ చేసింది లేదు. ఇండస్ట్రీలో ఎవరికి వారు సొంతగా ఎదగాలని అలా వదిలేసారా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అన్నది తెలియదు.
కానీ యాక్సిడెంట్ తర్వాత మాత్రం పవన్ నీ ముందు నేను ఉన్నానంటూ ముందుకొచ్చారు. అందుకే సాయితేజ్ బెడ్ మీద విరామంలోఉన్న సమయంలో ‘రిపబ్లిక్’ సినిమాని పీకే నెత్తిన వేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రచారం కోసం పీకే చేసిన సాయం అంతా ఇంతా కాదు. నేరుగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసి సినిమా కి కాస్త బజ్ తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలోనూ కొన్ని రకాల పోస్ట్ లు అభిమానుల్లో ఉత్సాహం నింపేలా చేసాయి. తాజాగా ఈసారి తేజ్ కోసం ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బరిలోకి దిగాడు.
సాయి తేజ్ ‘సత్య’ అనే మ్యూజికల్ షార్ట్ ఫిలింలో నటించాడు. ఈ షార్ట్ వీడియో చిత్రానికి సాయి తేజ్ మిత్రుడు నవీన్ విజయ్ కృష్ణ (నటుడు నరేశ్ తనయుడు) దర్శకత్వం వహించారు. ఓ సైనికుడు తన దేశం కోసం చేసే త్యాగాలను ఈ షార్ట్ ఫిలింలో చూపించనున్నారు. గాయని శృతి రంజని ఈ వీడియో చిత్రానికి సంగీతం అందించారు.
ఇందులో తేజ్ సరసన కలర్స్ స్వాతి నటించింది. ఈ గీతాన్ని నేరుగా చరణ్ చేతుల మీదుగా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటివరకూ తేజ్ కోసం చరణ్ చేసిందేం లేదు. సినిమా బాగుంటే ఓ ట్వీట్ తప్ప! దగ్గరుండి ప్రోత్సహించింది లేదు. ఈ నేపథ్యంలో సత్య కోసం చరణ్ రావడం కావాల్సినంత పాపులారిటీ తెచ్చి పెడుతుంది. మొన్న పవన్..నేడు చరణ్ –సాయితేజ్ జర్నీలో కీలక మార్పులే తెస్తున్నట్లు కనిపిస్తోంది.