అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ విధంగా చెప్పాలంటే ఆమె జీవితం తెరచిన పుస్తకం. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత స్టార్ హీరోయిన్ అయ్యి ఏకంగా 4 దశాబ్దాల పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన హవా కొనసాగించిన హీరోయిన్ గా ఆమెకి ప్రతేక గుర్తింపు ఉంది. ఇన్నేళ్ళ కెరియర్ లో 300 చిత్రాలలో ఆమె నటించింది. అందులో చైల్డ్ యాక్టర్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం వరకు ఉంటుంది.
తెలుగులో బడిపంతులు సినిమాలో సీనియర్ కి మనవరాలిగా నటించిన శ్రీదేవి తరువాత 16 ఏళ్ళ వయస్సు అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా సీనియర్ ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించడంతో పాటు అప్పటి స్టార్స్ అయిన ఏఎన్నార్ కృష్ణ కృష్ణంరాజు శోభన్ భాబు లాంటి స్టార్స్ అందరితో కూడా నటించింది. తరువాత జెనరేషన్ హీరోలైన వెంకటేష్ నాగార్జున మెగాస్టార్ చిరంజీవి రజినీకాంత్ కమల్ హాసన్ లాంటి స్టార్స్ తో కూడా శ్రీదేవి సుదీర్ఘ కాలం హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించింది.
ఇక శ్రీదేవి మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన అతిలోకసుందరి ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన శ్రీదేవి అక్కడ కూడా మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సినిమాలు చేసింది.
అక్కడ స్టార్స్ అందరితో ఇంచుమించు నటించింది. తరువాత బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని పెళ్లి చేసుకొని సినిమాలకి చాలా కాలం దూరం అయ్యింది. ఇలా సుదీర్ఘ నట ప్రస్థానంలో ఆమె జీవితంలో ఎన్నో సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.
వీటన్నింటిని ఇప్పుడు దీరజ్ కుమార్ అనే రైటర్ ఒక పుస్తకంగా తీసుకొస్తున్నారు. దీనికి ఇప్పటికే కుటుంబ సభ్యుల పర్మిషన్ కూడా లభించింది. శ్రీదేవిని 360 డిగ్రీస్ కోణంలో ఈ పుస్తకంలో ప్రతి విషయాన్ని ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు.
శ్రీదేవి లాంటి హీరోయిన్ బయోగ్రఫీ భవిష్యత్తు తరాలకి తెలియాలని ఇలా డాక్యుమెంట్ చేయడం జరిగిందని తెలిపారు. కచ్చితంగా తన పుస్తకం శ్రీదేవి గురించి తెలుసుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అని తెలిపారు.