ఫ్యామిలీ హీరోగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. విలన్ గా వరుసగా సినిమాలు చేస్తున్న సీనియర్ స్టార్ జగపతిబాబు. తెలుగు లోనే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ లో కూడా జగ్గూ భాయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన హిందీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించాడు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా జగపతిబాబు ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన తదుపరి సినిమా పుష్ప 2 అంటూ క్లారిటీ ఇచ్చాడు.
పుష్ప 1 లో కనిపించని జగపతిబాబు పుష్ప 2 లో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని స్వయంగా జగపతిబాబు క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో నటించడంను ఎప్పుడు కూడా ఆస్వాదిస్తాను అంటూ జగపతిబాబు పేర్కొన్నాడు.
ఇక అల్లు అర్జున్ ను తాను 20 ఏళ్ల క్రితం ఒక జిమ్ లో చూశాను. ఆ సమయంలో అతడు అల్లు అరవింద్ గారి కుమారుడు అనే విషయం కూడా నాకు తెలియదు. జిమ్ లో అతడు కష్టపడుతున్న తీరు చూసి ఆశ్చర్యం వేసింది. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది అనిపించింది. ఇప్పుడు పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా బన్నీ ఎదగడం ఆనందంగా ఉందని జగ్గూ భాయ్ కామెంట్స్ చేశాడు.