ఆ విషయంలో ఒక మెట్టు పైనే మలయాళ పరిశ్రమ..!

పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ ఎంత బిగ్గెస్ట్ హిట్లు అందుకుంటున్నా కొత్త కథలు.. కొత్త ఆలోచనలతో ప్రేక్షకుల మనసు గెలవాలంటే అది మలయాళ పరిశ్రమ వల్లే అవుతుంది. వారు చేసే సినిమాలు వందల కోట్ల బడ్జెట్.. నానా హంగామా ఉండదు. జస్ట్ కథ కరెక్ట్ గా రాసుకుని దాన్ని పర్ఫెక్ట్ గా తెరకెక్కించడమే వారి సూపర్ హిట్ ఫార్ములా. మరీ ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మల్లూవుడ్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. రోమాలు నిక్కబొడుచుకునే.. సీట్ ఎడ్జ్ కూర్చోబెట్టి థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ అందించడం వారి వల్లే అవుతుంది.

మనవాళ్లు అలాంటి థ్రిల్లర్ అటెంప్ట్ చేసినా ఎక్కడో ఒక చోట సబ్జెక్ట్ దాటి బయటకు వస్తారన్న టాక్ ఉంటుంది. కానీ మలయాళ పరిశ్రమలో అది జరగదు. మలయాళ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్స్ రాగా లేటెస్ట్ గా వచ్చిన అన్వేశిప్పిన్ కండెతుమ్ సినిమా మరోసారి ఆడియన్స్ అందరినీ తన వైపుకు తిప్పుకునేలా చేసింది. మలయాళంలో కంటెంట్ ఉన్న సినిమాలతో ఎప్పటికప్పుడు తన మార్క్ చూపిస్తున్న టోవినో థామస్ ఈ సినిమాలో లీడ్ హీరోగా నటించారు.

మర్డర్ మిస్టరీ చేధించే పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారన్నది కథ. అయితే సాధారణంగా ఒక సినిమాలో ఒక మర్డర్ మిస్టరీ కేసు సాల్వ్ చేయడం ఉంటుంది. కానీ అన్వేశిప్పిన్ కండెతుమ్ సినిమాలో రెండు అలాంటి కేసులు ఉంటాయి. రెండు కథలకు సంబంధం లేకుండా రెండు కేసులను హీరో అండ్ టీం సాల్వ్ చేస్తారు. సాధారణంగా ఇలా రెండు కథలను ఒకే సినిమాలో చెప్పడం అది కూడా క్రైమ్ థ్రిల్లర్ కథలు చెప్పడం మొదటిసారి అనే చెప్పొచ్చు. డైరెక్టర్ డార్విన్ కురియకోస్ కథ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా రాసుకున్నారు.

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ లో నిందితుడు ఎవరో తెలిసే సరికి ఆడియన్స్ ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఫిబ్రవరిలో థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా ఈమధ్యే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సౌత్ అన్ని భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా చూసిన వారంతా సర్ ప్రైజ్ అవుతున్నారు. క్రైం థ్రిల్లర్ ఆడియన్స్ అయితే ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే అనేస్తున్నారు. మొత్తానికి మరోసారి మలయాళ సినిమా తన మార్క్ చాటేలా డార్విన్ కురియకోస్ డైరెక్షన్ లో అన్వేశిప్పిన్ కండెతుమ్ సినిమా వచ్చిందని చెప్పొచ్చు.