కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నటించాలని ఉందా? ఎప్పటి నుంచో ఉన్న కోరికను నేరవేర్చుకునే అవకాశం కళ్ల ముందుందా? అంటే అవుననే తెలుస్తోంది. సూర్య 44వ చిత్రం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ కాంబినేషన్ లో సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చింది. `కంగువా` రిలీజ్ అయిన అనంతరం సూర్య ఈ చిత్రాన్నే పట్టాలెక్కిస్తాడు. ప్రస్తుతం ఆసినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో చిత్రం యూనిట్ స్టార్ హంట్ నిర్వహిస్తుంది.
‘కాస్టింగ్ కాల్ ఫర్ సూర్య 44` పేరుతో దీన్ని ఓ ప్రకటన సోషల్ మీడియాలోకి వదిలారు. ఆసక్తిగల నటీనటులు సంప్రదించవచ్చని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ కాస్టింగ్ కాల్‌కు భాషతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ళ నుంచి 80 యేళ్ళ వయస్సున్న స్త్రీ పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిలో కొందర్ని ఎంపిక చేస్తారు. సూర్యతో ఛాన్స్ కావాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఔత్సాహికులు మంచి ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వేదికలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి.
ఆ మధ్య ఆర్సీ 16 చిత్రానికి కూడా దర్శకుడు బుచ్చిబాబు కూడా ఇలాగా స్టార్ హంట్ నిర్వహించాడు. ఉత్తరాంంధ్రా బ్యాక్ స్టోరీ కావడంతో శ్రీకాకుళం..విజయనగనం జిల్లాల నుంచి కవాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చాడు. ఆ ప్రాంతాల్లో నిర్వహించిన స్టార్ హంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వందల్లో జనాలొచ్చారు. వాళ్లలో కొందర్ని ఎంపిక చేసుకున్నారు. తమిళనాడులోనూ సినిమాలంటే ఆసక్తి ఉన్న వారు చాలా మందే ఉన్నారు. అప్పుడప్పుడు కొందరు దర్శకులు ఇలాంటి కాల్స్ తో కొత్త వాళ్లని తెరపైకి తెస్తుంటారు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్న వారికి ఇలాంటివి మంచి వేదికలు. తమ ట్యాలెంట్ని ప్రూవ్ చేయగలిగితే ఒక్క ఛాన్స్ జీవితాన్నే మార్చేస్తుంది. ఇండస్ట్రీలో అలా ఎదిగిన వారెంతో మంది ఉన్నారు. మరి సూర్య సినిమాకి ఎంత మందిని తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతం సూర్య కంగువా అనే పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సూర్య స్వయంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.