ఇంగ్లీష్ టైటిల్ తో ఇద్దరిలో హిట్టు కొట్టేదెవరు..?

టాలీవుడ్ లో దసరా పండుగ సందర్భంగా ఆసక్తికరమైన పోటీ జరగనుంది. సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ అక్కినేని నాగార్జున బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ నటిస్తున్న సినిమాలను ఒకే రోజు థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆసక్తికరంగా ఇవి రెండూ ఇంగ్లీష్ టైటిల్స్ తో రూపొందిన చిత్రాలే అవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ “గాడ్ ఫాదర్”. మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కింది. అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా “ది ఘోస్ట్”. ఇదొక హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ‘శివ’ రిలీజ్ డేట్ ని సెటిమెంట్ గా భావించి.. వచ్చే నెల 5వ తేదీనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

నాగ్ ‘కిల్లర్’ మొదలుకొని ‘వైల్డ్ డాగ్’ వరకూ ఎన్నో చిత్రాల ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టారు. ‘హలో బ్రదర్’ ‘క్రిమినల్’ ‘మాస్’ ‘సూపర్’ ‘బాస్’ ‘డాన్’ ‘కింగ్’ ‘భాయ్’ ‘ఆఫీసర్’ వంటి ఈ సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో కొన్ని హిట్టయితే మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అలానే చిరు కూడా ‘ఐ లవ్ యూ’ నుంచి ‘స్టాలిన్ వరకూ ఎన్నో ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చారు.

‘లవ్ ఇన్ సింగపూర్’ ‘హీరో’ ఛాలెంజ్’ ‘స్టేట్ రౌడీ’ ‘గ్యాంగ్ లీడర్’ ‘హిట్లర్’ ‘మాస్టర్’ ‘బిగ్ బాస్’ ‘డాడీ’ ‘స్టాలిన్’ లాంటి సినిమాలు ఇంగ్లీష్ టైటిల్స్ తో రూపొందిన సంగతి తెలిసిందే. అందులో కొన్ని విజయవంతం అయితే మరికొన్ని పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు నాగార్జున మరియు చిరంజీవి ఇద్దరూ ‘ది ఘోస్ట్’ & ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాలతో తాబోతున్నారు. ఇంగ్లీష్ టైటిల్ తో వీరిలో ఎవరు హిట్టు కొడతారనేది చర్చనీయాంశంగా మారింది.

నిజానికి టాలీవుడ్ లో గత కొన్ని దశాబ్దాలుగా ఇంగ్లీష్ టైటిల్స్ తో అనేక సినిమాలు వచ్చాయి. పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలైన తర్వాత యూనివర్సల్ అప్పీల్ కోసమని ఫిలిం మేకర్స్ అంతా అలాంటి పేర్లనే పెడుతున్నారు. టైటిల్ అనేది జనాల దృష్టిని మాత్రమే ఆకర్షించగలదు.. కానీ సినిమా ఫలితాన్ని మాత్రం కంటెంట్ డిసైడ్ చేస్తుందని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది.

ఇప్పుడు ‘ది ఘోస్ట్’ మరియు ‘గాడ్ ఫాదర్’ ఇంగ్లీష్ పేర్లతో వస్తున్నప్పటికీ.. హిట్టు ప్లాప్ అనేది కంటెంట్ పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. కాకపోతే ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే మాత్రం మెగాస్టార్ మూవీ కంటే కింగ్ చిత్రానికి కాస్త ఎక్కువ బజ్ వుందనేది అర్థమవుతుంది. రిలీజ్ కు ఇంకా రెండు వారాలకు పైగా సమయం ఉంది కాబట్టి.. ఈ గ్యాప్ లో మేకర్స్ చేసే ప్రచార కార్యక్రమాలను బట్టి హైప్ క్రియేట్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

కాగా ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సల్మాన్ ఖాన్ మరియు నయనతార కీలక పాత్రలు పోషిస్తుండగా..సత్యదేవ్ – సముద్ర ఖని – తాన్యా రవిచంద్రన్ – బ్రహ్మాజీ – మురళీ శర్మ – ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ పై ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాని తెలుగు హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇక నాగ్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. గుల్ పనాగ్ – అనిఖా సురేంద్రన్ – జయప్రకాష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ – పుస్కుర్ రామ్ మోహన్ రావు – శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.