ఫ్యాషన్ పవర్ హౌస్.. నటి మసాబా గుప్తా తన చిరకాల ప్రియుడు సత్యదీప్ మిశ్రాను జనవరి 27న సింపుల్ కోర్ట్ వెడ్డింగ్ స్టైల్లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
మసాబా తండ్రి – దిగ్గజ క్రికెటర్ వివ్ రిచర్డ్స్ కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తె- అల్లుడుకు ఆశీర్వాదాలు అందించారు. మసాబా.. ప్రముఖ నటి నీనా గుప్తా -వ్ రిచర్డ్స్ కుమార్తె. నీనా గుప్తా – రిచర్డ్స్ రిలేషన్ షిప్ లో ఉన్న క్రమంలో 1989లో మసాబాకు తల్లిదండ్రులయ్యారు. ఈ జంట వివాహం చేసుకోలేదు. నీనా తన కుమార్తెను భారతదేశంలో ఒంటరి తల్లిగా పెంచేందుకు నిర్ణయించుకున్నారు.
సోషల్ మీడియాలో కనిపించిన అనేక ఫోటోలలో రిచర్డ్స్ మసాబా వివాహానికి చాలా ప్రత్యేకమైన లుక్ తో హాజరయ్యారు. ఎంతో సింపుల్ గా ఫ్లోరల్ డిజైన్ చొక్కా ధరించి ఈ వేడుకలో కనిపించారు. తన కూతురితో పోర్ట్రెయిట్ కి పోజులిస్తూ క్రికెటర్ రిచర్డ్స్ నవ్వుతూ కనిపించారు. అతను మసాబా- సత్యదీప్- నీనా గుప్తా..ఆమె భర్త వివేక్ మెహ్రాతో కలిసి ఒక గ్రూప్ ఫోటోకి కూడా పోజులిచ్చాడు.
ఈ ప్రేమకథ సినిమాటిక్..!
నిజానికి నీనా-వివ్ రిచర్డ్స్ సినిమాటిక్ లవ్ స్టోరి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఈ ప్రేమాయణం గురించి తెలిసినవారు చెబుతుంటారు.
గతంలో బాలీవుడ్ నటీమణులు -భారతీయ క్రికెటర్ల మధ్య చాలా ప్రేమ వ్యవహారాలు వెలుగు చూసి ఉండొచ్చు కానీ నీనా గుప్తా వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ప్రేమాయణం గుట్టు చప్పుడు కాకుండా సాగింది. ఆమె తన హృదయాన్ని అతడికి అంకితమిచ్చింది. నీనా గుప్తా పరిశ్రమలో బాహాటంగా మాట్లాడే బోల్డ్ నటిగా నాడు పాపులర్. డ్యాషింగ్ పెర్ఫామర్ గా తన అద్భుతమైన నటనతో పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన నటి. ఆమె వివియన్ తో ప్రేమలో పడినప్పుడు భారతీయ మీడియాకి మాత్రమే కాదు.. విదేశీ మీడియాకి కూడా దానిని కవర్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ కొన్ని కారణాలు .. సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా వీరిద్దరి ప్రేమకథ సుదీర్ఘ కాలం మనుగడ సాగించలేకపోయింది.
ఈ జంట మొదటిసారి ముంబైలోని ఒక పార్టీలో కలిసారు. అక్కడికి నటి నీనాను ప్రముఖ ఫిల్మ్ మేకర్ ఆహ్వానించారు. ఆ ఇద్దరికి అంతకుముందు పరిచయం లేదు. అలాగే వివ్ కూడా బాలీవుడ్ కు అస్సలు పరిచయస్తుడు కాడు. కానీ నీనా-వివ్ మధ్య ఒక స్పార్క్ హార్ట్ లోకి దూసుకెళ్లిన క్షణమది. ఇద్దరి మధ్య సమావేశం అయిన అనంతరం తొలి చూపులోనే వెంటనే డేటింగ్ ప్రారంభించారు. నిజానికి వివ్ అప్పటికే వివాహం చేసుకున్నాడు. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా కాలం పాటు ఈ జంట తమ సంబంధాన్ని దాచి ఉంచే ప్రయత్నం చేసారు. కానీ ఆశ్చర్యకరంగా ఒక రోజు నీనా గర్భవతి అని తెలిసింది. కానీ వివియన్ ను వివాహం చేసుకునే ఛాన్స్ లేదు.
నీనా గుప్తా సనాతన సాంప్రదాయాలంటే పడి చచ్చే తల్లిదండ్రుల పెంపకంలో పెరిగారు. ఆ రోజుల్లో వివాహేతర సంబంధంతో బిడ్డను కలిగి ఉండటం అనేది నేరం. అలాంటివి చాలా అరుదు. ఇవి బయటికి బహిరంగంగా వినిపించే వార్త కాదు. నిజానికి నేటికీ సెలబ్రిటీలు ప్రేమలో ఉన్నా కానీ పిల్లలను కనడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు.
ఏదేమైనా నీనా గుప్తా సమాజం లేదా దాని సనాతన ప్రమాణాలను కేర్ చేసే తరహా కాదు. ఆమె తన ప్రేమికుడితో తొలి బిడ్డ మసాబా గుప్తాకు జన్మనివ్వడానికి ఫ్రెగ్నెన్సీతో ఉండేందుకు ధైర్యం చేసారు. ఆమె తన స్నేహితులు.. కుటుంబ సభ్యుల అండదండలు లేకపోయినా అందరికీ ఎదురు నిలిచి ధైర్యంగా బిడ్డను కన్నారు. అలా పుట్టిన బిడ్డ మసాబా గుప్తా బాలీవుడ్ లో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా నటిగా ఇప్పుడు పాపులర్. నేడు వైవాహిక బంధంతో కొత్త జీవితంలో ప్రవేశించారు మసాబా.
ముంబై మిర్రర్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నీనా గుప్తా తన గతంపై అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు. ”నాకు వివాహ బంధంలో పిల్లలు పుట్టరు. అది నాకు తెలుసు. ప్రతి బిడ్డకు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. నేను మసాబాతో ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను. కాబట్టి అది మా సంబంధాన్ని ప్రభావితం చేయలేదు. కానీ మసాబా ఎంతో బాధపడిందని నాకు తెలుసు” అని అన్నారు.