ఇన్‌సైడ్‌ స్టోరీ: టాలీవుడ్‌కి కొంచెం ఇష్టం, చాలా కష్టం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. సినిమా షూటింగుల్లేవు.. రిలీజులు అసలే లేవు లాక్‌డౌన్‌ కాలంలో. లాక్‌ డౌన్‌ నుంచి కొన్ని వెసులుబాట్లు వచ్చాక, ఇటీవలే సినిమా షూటింగులకు లైన్‌ కాస్త క్లియర్‌ అయ్యింది. ఒకట్రెండు చిన్న సినిమాల షూటింగులు ప్రారంభమయ్యాయి కూడా. కానీ, పెద్ద సినిమాల విషయంలోనే ఇంకా గందరగోళం కొనసాగుతోంది. మరోపక్క, టాలీవుడ్‌లో తొలి కరోనా కేసు నమోదయ్యిందనీ, బండ్ల గణేష్‌కి కరోనా పాజిటివ్‌ సోకిందనీ ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఓ పూజారికి కరోనా సోకిందనగానే, ఆ ఆలయాన్ని రెండు మూడు రోజులపాటు మూసేసి శానిటేషన్‌ చేయాల్సి వచ్చింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. మరి, షూటింగ్‌లో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలితే పరిస్థితేంటి.? ఇదే ఇప్పుడు సినీ ప్రముఖుల్ని వేధిస్తోన్న ప్రశ్న. అందుకే, పెద్ద సినిమాలు ఆచి తూచి అడుగులేస్తున్నాయి. ఓ వైపు కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ.. ఈ విషయంలో పోటీ పడ్తున్నాయి. తమిళనాడు, మహారాష్ట్రల సంగతి సరే సరి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, ప్రభుత్వం అనుమతులిచ్చినా.. సినిమా షూటింగులు జరపడానికి మాత్రం మెజార్టీ సినీ ప్రముఖులు సుముఖత వ్యక్తం చేయకపోవడాన్ని తప్పు పట్టలేం. మరోపక్క, సినిమా థియేటర్లు తెరుచుకుంటే తప్ప, సినిమా భవిష్యత్తు గురించీ ఏమీ చెప్పలేమని సీనియర్‌ నిర్మాతలు చెబుతుండడం గమనార్హం.

ఓటీటీ క్రమక్రమంగా అందరికీ పరిచయమైపోతోంది.. ‘సినిమా థియేటర్స్‌కి వెళ్ళడం ఎందుకు దండగ..’ అన్న అభిప్రాయాన్ని కొందరు ఓటీటీ అభిమానులు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కాగా, షార్ట్‌ ఫిలింస్‌కి ఎక్కువ.. సినిమాలకి తక్కువ.. అనే స్థాయి గల చాలా చాలా చిన్న సినిమాలు.. పైగా, బి-గ్రేడ్‌ సినిమాలకు ఈ ఓటీటీ వరంగా మారుతోంది. వర్మ రూపొందించిన ‘క్లైమాక్స్‌’ ఆ కోవలోకే చెల్లుతుంది. ఆ తరహా సినిమాలు (వీటినసలు సినిమాలని అనగలమా.?) లాభాల్ని ఆర్జించే అవకాశం వుండడంతో.. కొన్నాళ్ళపాటు ఓ మోస్తరు పెద్ద నిర్మాతలు కూడా అటు వైపు చూసే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా, తెలుగు సినీ పరిశ్రమకు ఇది నిజంగానే కష్ట కాలం. ఆ మాటకొస్తే, ఇండియన్‌ సినిమాకీ.. ప్రపంచ సినిమాకీ ఇది చాలా చాలా కష్టకాలం. సినిమా రంగానికి భబిష్యత్తు వుందా.? లేదా.? అనేదానిపైనా చాలా ఆందోళన నెలకొంటోన్న పరిస్థితి ఇది.