ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ దానిపైనే..!

‘బాహుబలి’ ప్రాంఛైజీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన డార్లింగ్ ప్రభాస్.. ఆ ఇమేజ్ ను కాపాడుకునేలా ప్లాన్స్ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతూ ఏడాది పొడవునా బిజీగా ఉంటున్నారు.

ప్రభాస్ ఎంచుకుంటున్న కథలన్నీ ఒకదానితో మరొక దానికి సంబంధం లేకుండా ఉంటున్నాయి. వేటికవే ప్రత్యేకమైన జోనర్స్ లో సరికొత్త నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలే కావడం విశేషం. కాకపోతే అవి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చే ప్రతీ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. దీంతో వాటిని అందుకోవడంలో విఫలమవుతూ.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా నిలుస్తున్నాయని చెప్పాలి.

మూడేళ్ళ క్రితం ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ ప్లాప్ గా మిగిలింది. హిందీ వెర్షన్ నార్త్ లో అనూహ్యమైన వసూళ్ళు రాబట్టినప్పటికీ.. మొత్తంగా చూసుకుంటే పరాజయాల జాబితాలోనే చేరిపోయింది.

దీని తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి పీరియాడిక్ లవ్ డ్రామాతో వచ్చారు ప్రభాస్. విజువల్ గ్రాండియర్ గా పేర్కొనబడిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఉత్తరాదిలో కనీస ఓపెనింగ్ వసూళ్ళు కూడా రాబట్టలేకపోయింది.

బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్స్ పడటంతో ఈసారి రాబోయే సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ సినిమాని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ మైథలాజికల్ డ్రామా తెరకెక్కుతోంది.

డార్లింగ్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆదివారం రిలీజైన టీజర్ చూసి తీవ్ర నిరాశ చెందారు. రామాయణం ఆధారంగా 3డీ టెక్నాలజీలో ఓ విజువల్ వండర్ ను ఆవిష్కరిస్తారు అనుకుంటే.. ఓ యానిమేషన్ మోషన్ పిక్చర్ మూవీతో వచ్చారని ఆవేదన చెందారు.

‘ఆదిపురుష్’ ప్రమోషనల్ కంటెంట్ పై వచ్చిన ట్రోలింగ్ ఇటీవల కాలంలో ఏ సినిమా టీజర్ లేదా ట్రైలర్ కు రాలేదు. ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఐటమ్ గా మారిపోయింది. ఇతర హీరోల ఫ్యాన్ వార్స్ కోసం ఈ టీజర్ లోని షాట్స్ ని వాడుకుంటున్నారనే కంటెంట్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాపై డార్లింగ్ అభిమానుల ఆశలు సన్నగిల్లాయని నెట్టింట కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు ”సలార్” సినిమాపైనే ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకుంటున్నారు.

‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘సలార్’ మూవీ తెరకెక్కుతోంది. దర్శకుడి మార్క్ భారీ ఎలివేషన్లు మరియు యాక్షన్ సీన్స్ తో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్. మరియు లీకైన వీడియోలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

‘సలార్’ కచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించే సినిమా అవుతుందని అందరూ భావిస్తున్నారు. ‘కేజీఎఫ్’ దర్శకుడితో కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ సత్తా ఏంటో చూపిస్తాడని అనుకుంటున్నారు. అగ్ర హీరో లైనప్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ.. ముందుగా ‘సలార్’ తో సెన్సేషన్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నారు. 2023 సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ తో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ వంటి పాన్ ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. ఇది సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కే సైన్స్ ఫిక్షన్ మూవీ. అలానే మారుతి దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ థ్రిల్లర్ చేస్తున్నారు ప్రభాస్. ఇదే క్రమంలో సందీప్ వంగాతో ‘స్పిరిట్’ అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.