ఇళయరాజా.. ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఆయన పాట వింటే చాలు.. మ్యూజిక్ తో ప్రేమలో పడిపోతాం. దాదాపుగా ప్రతీ సంగీతాభిమాని ఇళయరాజాకు ఫ్యానే. 1970లో సంగీత ప్రయాణాన్ని మొదలు పెట్టిన మ్యాస్ట్రో ఇళయరాజా.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల చిత్రాలకు మ్యూజిక్ అందించారు. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారు.
ఇప్పటి వరకు 1400 వందలకు పైగా సినిమాలకు మ్యూజిక్ అందించి రికార్డు క్రియేట్ చేశారు ఇళయారాజా. ఏడు వేలకు పైగా పాటలకు బాణీలు కట్టారు. తన ప్రతిభకు గాను అనేక అవార్డులతో పాటు రివార్డులు కూడా పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 80 ఏళ్ల వయసులో కూడా తన మ్యూజిక్ తో అలరిస్తున్నారు.
అయితే ఎప్పటి నుంచో ఇళయరాజా బయోపిక్ తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇళయారాజా టైటిల్ తోనే మ్యూజిక్ మ్యాస్ట్రో బయోపిక్ ను అనౌన్స్ చేశారు. ది కింగ్ ఆఫ్ మ్యూజిక్ అని మూవీకి ట్యాగ్ లైన్ ఇచ్చారు మేకర్స్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇళయరాజా రోల్ లో యాక్ట్ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. బుధవారం జరిగిన పూజా కార్యక్రమానికి కమల్ హాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి టైటిల్ పోస్టర్ ను లాంఛ్ చేశారు. ఈ పోస్టర్ లో చెన్నై రోడ్ల మీద ఇళయరాజా హార్మోనియం పెట్టె పట్టుకుని ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నట్టు ఉంది. ఈ మూవీని పీకే ప్రైమ్ ప్రొడక్షన్, మెర్క్యూరీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో చాలా మంది తమిళ, తెలుగు స్టార్ నటీనటులు అతిథి పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. 2025లో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ప్రాజెక్టుకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇళయరాజానే! తన బయోపిక్ కు తానే మ్యూజిక్ అందించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఇంతకంటే పర్ఫెక్ట్ ఛాయిస్ మరొకటి ఉండదేమోనని సినీ పండితులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.
https://www.tupaki.com/entertainment/ilayarajabiopicrevelead-1350283