ఈ బ్యూటీలో ఉత్సాహం… భయం.. గర్వం అన్నీ ఒకేసారి!

బాలీవుడ్ హాట్ బ్యూటీ డయానా పెంటి గురించి పరిచయం అవసరం లేదు. దశాబ్ధ కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతున్నా అమ్మడికి ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు. డెబ్యూ చిత్రం ‘కాక్టెయిల్’ తర్వాత అమ్మడు చాలా సినిమాలు చేసింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ క్రమంలో మాలీవుడ్ లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ ఏడాది ‘సెల్పీ’..’బ్లడీ డాడి’ లాంటి చిత్రాలతోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

వాటి పరిస్థితి అంతే. ప్రస్తుతం ‘అద్భుత్’..’సెక్షన్ 84′ లాంటి సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ రెండింటిలో అమ్మడికి ‘సెక్షన్ 84’ మాత్రం చాలా స్పెషల్ అంటుంది. ఈసినిమా అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతుంది.

కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో రిభూదాస్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా డయాన్ ఆన్ సెట్స్ ఎక్స్ పీరియన్స్ షేర్ చేసుకుంది. అదేంటో ఆమె మాటల్లోనే..

‘ఈ ప్రయాణం నాకెంతో ప్రత్యేకమైనది. ఈ సినిమా ప్రారంభానికి ముందు అమితాబచ్ తో కలిసి నటించబోతున్నాను అన్న విషయం తెలిసినప్పటి నుంచి మూడు రకాల భావోద్వేగాలు నన్ను వెంటాడాయి. ఒకేసారి ఉత్సాహం..భయం..గర్వం అన్ని నాలో మొదలయ్యాయి.

అమితాబ్ సర్ తో నటించడం అంటే ముందు భయపడ్డాను. ఆ తర్వాత ఉత్సాహం కలిగింది. అటుపై సినిమా పూర్తయిన తర్వాత గర్వంగానూ అనిపించింది. సెట్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ మూడింటి అనుభూతికి ఓకేసారి లోనయ్యాను.

ఆయన ఎంతో స్వేచ్ఛ ఇచ్చారు. అందుకే నా వంతు బెస్ట్ ఇవ్వగలిగాను. సెట్ లో స్ట్రిక్ట్ వాతావరణం ఉంటే? నేను నటించలేను. టెన్షన్ పడిపోతాను. కానీ ఈ సినిమా మొదలు నుంచి పూర్తయ్యే వరకూ చాలా స్వేచ్ఛగా పనిచేయగలిగాను. ఆయతనో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి. ఇలాంటి అవకాశం కల్పించిన దర్శకుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని అన్నారు.