ఈతరం స్టార్ హీరోల్లో స్నేహం ఎక్కువగా కనిపించడం లేదు.. ఈగోల కారణంగా ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు కూడా రావడం లేదు. కానీ ఒకప్పుడు ఏడాదికి రెండు మూడు స్టార్ హీరోల మల్టీ స్టారర్ లు వచ్చేవి. ముఖ్యంగా ఎన్టీఆర్.. ఏయన్నార్ లు పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే.
ఎన్టీఆర్.. ఏయన్నార్ లు కలిసి నటించిన రామకృష్ణులు సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 1978 సంవత్సరంలో వచ్చిన ఆ సినిమా అప్పట్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ సినిమా వెనుక కథ తెలిస్తే ఎన్టీఆర్.. ఏయన్నార్ ల మధ్య ఇంతటి చక్కటి అనుబంధం ఉందా అనే ఆశ్చర్యం కలగక మానదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే…. ఎన్టీఆర్ ఒక సారి ఏయన్నార్ తో తన వద్ద రెండు స్క్రిప్ట్ లు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో నచ్చిన దాన్ని ఎంచుకుని నటించమని చెప్పాడట. అందుకు ఏయన్నార్ చాణక్య – చంద్రగుప్త స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకున్నాడు. అందులో చాణక్యుని పాత్రను ఏయన్నార్ పోషించగా.. చంద్రగుప్తుని పాత్రలో ఎన్టీఆర్ నటించడం తో పాటు దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ స్వయంగా ఆ సినిమా ను నిర్మించారు.
చాణక్య – చంద్రగుప్త సినిమాను చేసినందుకు గాను ఏయన్నార్ యొక్క హోం బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక సినిమాను చేసేందుకు ఎన్టీఆర్ డేట్లు ఇచ్చాడు. మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇస్తానంటూ అన్నగారు ఎన్టీఆర్ చెప్పాడట. ఆ డేట్లను ఎలా వినియోగించాలా అని ఎదురు చూస్తున్న ఎయన్నార్ వద్దకు ఒక సారి ప్రముక నిర్మాత రాజేంద్ర ప్రసాద్ వచ్చారట.
అప్పట్లో వి బి రాజేంద్ర ప్రసాద్ తో ఏయన్నార్ కు మంచి స్నేహం ఉంది. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ లో ఏయన్నార్ ను నటించాల్సిందిగా అడిగిన సమయంలో మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ కు ఎక్కువ లాభాలు రావాలనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్ ను కూడా ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం చేద్దామని సూచించాడట.
అలా ఇద్దరి స్టార్ హీరోలు కలిసి జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బ్యానర్ లో నటించారు.. అదే రామకృష్ణులు. ఆ సినిమా నిర్మాణ భాగస్వామిగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా ఉంటుంది. తన సినిమాలో నటించాడనే ఉద్దేశ్యంతో తన పారితోషికం చాలా ఎక్కువ అయినా కూడా ఎన్టీఆర్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నటించేందుకు ఓకే చెప్పడం వారిద్దరి స్నేహానికి నిదర్శం. ఇప్పుడు హీరోల్లో ఇంతటి స్నేహం ఉందా అనే ప్రశ్నకు మీ సమాధానం ఏంటి?