పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ విషయం పైనే చర్చ గట్టిగానే నడుస్తోంది. మే9వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో చెప్పినా.. ఎన్నికల వలన వాయిదా తప్పదని అందరికి ముందే క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రస్తుతం రిలీజ్ డేట్స్ పై ఎన్ని గాసిప్స్ వస్తున్నా కూడా పెద్దగా క్లారిటీ ఇవ్వడం లేదు. అలా అని కొత్త డేట్ కూడా ప్రకటించడం లేదు. దీంతో కల్కి మేకర్స్ పై ఫ్యాన్స్ అయితే కాస్త గుర్రుగానే ఉన్నారు.
ఏదో ఒక అప్డేట్ ఇవ్వండని సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెడుతున్నారు. ఒకవేళ రిలీజ్ వాయిదా నిజమే అయితే కొత్త తేదీ అయినా ప్రకటించాలని కోరుతున్నారు. కానీ మూవీ యూనిట్ మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా గడుపుతోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ జోరుగా వినిపిస్తోంది.
జూన్ మొదటి లేదా రెండో వారంలో కల్కి మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ లో అనుకూలంగా ఉండే అంశంతో పాటు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని విడుదల తేదీని లాక్ చేసినట్లు సమాచారం. జూన్ ఫస్ట్ వీక్ అనంతరం ఎన్నికల వేడి తగ్గడంతోపాటు విద్యార్థులకు ఇంకా కొన్ని సెలవులు ఉండటం వల్ల ఓపెనింగ్స్ విషయంలో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాజిటివ్ టాక్ వస్తే తిరుగేలేదు.
అయితే ఈ సినిమాను వాయిదా వేసి అక్టోబర్ లేదా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని కూడా మొదట మేకర్స్ భావించారట. కానీ ఇటీవల అశ్వినీ దత్ తో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లతో సమావేశమయ్యారు! వారంతా మే చివర్లో లేదా జూన్ లో రిలీజ్ చేయమని సలహా ఇచ్చారని టాక్. వాటిని పరిగణనలోకి తీసుకుని కొత్త డేట్ ను నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రూ.600 కోట్ల బడ్జెట్ తో నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వారితో వీఎఫ్ ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. దగ్గరుండి నాగ్ అశ్విన్ అన్ని పనులు చూసుకుంటున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుందో!