కాల భైరవ.. మరో ప్రయోగంతో రాబోతున్న లారెన్స్

వైవిధ్యమైన పాత్రలు, సెన్సేషనల్ ప్రాజెక్టులతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి చిత్రాలకు పేరొందిన నిర్మాత కోనేరు సత్యనారాయణతో లారెన్స్ క్రేజీ సినిమాతో రెడీ అవుతున్నారు. ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, గోల్డ్ మైన్ టెలీ ఫిల్మ్స్‌, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్లు కలసి భారీ ప్రాజెక్ట్ గా ‘కాల భైరవ’ ను తెరపైకి తీసుకువస్తున్నాయి.

డైనమిక్ స్టార్ రాఘవ లారెన్స్ ఈ సినిమాతో 25వ చిత్రాన్ని పూర్తి చేసుకుంటున్నారు. తన కెరీర్‌లో నూతన కోణాన్ని పరిచయం చేస్తూ, ఈసారి సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ, ‘రాక్షసుడు’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు ఇచ్చిన ట్రాక్ రికార్డ్ తో ఈ భారీ ప్రాజెక్ట్ కు సారథ్యం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ విడుదలతోనే ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది.

‘ది వరల్డ్ విత్ ఇన్’, ‘ఏ పాన్ ఇండియా సూపర్ హీరో ఫిల్మ్’ లాంటి ట్యాగ్ లైన్స్ సినిమాకు ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమాను 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రాఘవ లారెన్స్ లుక్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేపుతోంది. హీరో లుక్ లోని కఠినత్వం, పవర్ చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. సూపర్ హీరోగా లారెన్స్‌కి ఇది ఒక కొత్త దశను ప్రారంభించనుందని చెప్పవచ్చు. కోనేరు సత్యనారాయణ మరియు మనీష్ షా నిర్మాణ విలువలతో ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. భారీ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేందుకు మేకర్స్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 2025 వేసవిలో ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. లారెన్స్ అభిమానులు ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో లారెన్స్ సూపర్ హీరోగా కనిపించబోతుండటంతో ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోందన్న టాక్ వినిపిస్తోంది. మేకర్స్ అందించే మరిన్ని వివరాల కోసం అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.