క్రైమ్ కథలో హరీష్ శంకర్ కమర్షియల్ లెక్కలు

మాస్ మహారాజ్ రవితేజ ఈ మధ్యకాలంలో పెద్దగా రీమేక్ కథలను టచ్ చేయలేదు. కానీ ఇప్పుడు హరీష్ శంకర్ తో మళ్ళీ అతను బాలీవుడ్ క్రైమ్ కథను తెలుగులో మిస్టర్ బచ్చన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. 2018 లో వచ్చిన రెయిడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు ఇదివరకే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ క్రైమ్ కథలో హరీష్ శంకర్ తన మార్క్ కు తగ్గట్టుగా పలు కమర్షియల్ అంశాలను కూడా హైలెట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఒరిజినల్ కథలో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ చాలా సీరియస్ లుక్కుతోనే కనిపించాడు. కానీ ఇప్పుడు రవితేజను మాత్రం అందుకు భిన్నంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన మిరపకాయ్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఒకవైపు సీరియస్ గా కనిపిస్తూనే మరొకవైపు తనదైన శైలిలో కామెడీ టచ్ కూడా గట్టిగానే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా ప్రత్యేకంగా నిలబబోతున్నాయట. ఇలాంటి క్రైమ్ కథలో కమర్షియల్ సాంగ్స్ ను ఇరికించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం స్పేస్ క్రియేట్ చేసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంచి రొమాంటిక్ డ్యూయెట్స్ కూడా మిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే అమెరికాలో ఒక సాంగ్ చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ మరికొన్ని రోజుల్లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతోంది. ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ అమెరికా వెళ్ళాడు. అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ తో కూడా ట్యూన్స్ సిద్ధం చేయించుకుంటున్నాడు. ఇక పనిలో పనిగా ఒక సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేయాలి అని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లోనే ఫినిష్ అవుతోంది. ఇదివరకే దర్శకుడు హరీష్ పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడంతో ఆ సినిమాకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వీలైనంత తొందరగా మిస్టర్ బచ్చన్ సినిమాను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు. మరి ఈ సినిమా అతనికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.