భన్సాలీ ఎంచుకునే కాన్సెప్ట్.. కాన్వాస్.. కాస్ట్యూమ్స్.. సెట్లు.. బడ్జెట్ వగైర వగైరా ఎల్లపుడూ చర్చనీయాంశమే! భారీ కాన్వాస్.. భారీ సెట్స్.. భారీ బడ్జెట్లతో కళాత్మక చిత్రాల్ని తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పని లేదు. యూనిక్ జానర్ ని ఎంపిక చేసుకుని ఇప్పటికే పలు క్లాసిక్స్ ని తెరకెక్కించారు. భన్సాలీ సినిమాలో నటించడం అంటే ఆర్టిస్టుకు ఎనలేని గౌరవం. జీవిత కాలంలో ఒకసారి అయినా భన్సాలీ తో కలిసి పని చేయాలని తపించని వారు ఉండరు. హీరోలు అయినా హీరోయిన్లు అయినా నటీనటులు ఎవరైనా భన్సాలీ సినిమాలో ఒక సన్నివేశంలో కనిపించినా చాలని భావిస్తారు. భారతదేశంలో అంతటి ప్రభావవంతమైన దిగ్ధర్శకులు ఆయన.
భన్సాలీ తెరకెక్కించిన గంగూభాయి కథియావాడీ (2022) గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన హీరామండీ అనే ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. హీరామండి భారీ బడ్జెట్ తో కూడుకున్న ఒక వెబ్ సిరీస్. నిజకథలతో రూపొందుతోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”నేను చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ హీరామండి” అని సంజయ్ లీలా భన్సాలీ అన్నారు. తన తదుపరి వెబ్ సిరీస్ హీరామండి గురించి ఇతర విషయాలు మీడియాతో మాట్లాడారు
భన్సాలీ మొదటి గ్లోబల్ డ్రామా సిరీస్ ‘హీరామండి’. ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే ఇండస్ట్రీలో అగ్ర కథానాయికలంతా ఇందులో భాగం. మనీషా కొయిరాలా- సోనాక్షి సిన్హా- అదితి రావ్ హైదరీ-రిచా చద్దా-షర్మిన్ సెగల్- సంజీదా షేక్ లాంటి అద్భుతమైన ప్రతిభావంతులైన స్టార్స్ పోషించిన కీలక పాత్రలతో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ సిరీస్ పై ఎంతో క్యూరియాసిటీని పెంచింది.
ఈ వెబ్ సిరీస్ 1940ల నాటి భారత స్వాతంత్య్ర పోరాటంలో గందరగోళ నేపథ్యానికి పూర్తి భిన్నంగా వేశ్యల జీవనం వారి పోషకుల కథలేమిటన్నది తెరపై ఆవిష్కరిస్తుంది. అందగత్తెలైన వేశ్యలతో మిరుమిట్లుగొలిపే జిల్లా అయిన హీరామండి ప్రాంత సాంస్కృతిక వాస్తవికతను తెరపై ఆవిష్కరిస్తున్నారు. కోతాస్ (వేశ్యల ఇల్లు)లో ప్రేమ- ద్రోహం-వారసత్వం – రాజకీయాలు వంటి అంశాలను సంజయ్ లీలా భన్సాలీ సృజించారు. లార్జర్ దేన్ లైఫ్ కథలు.. సంక్లిష్టమైన మనోహరమైన పాత్రలు.. అద్భుత సంఘర్షణలతో నిండిన ప్రపంచాన్ని హీరామండీలో వీక్షించగలరని భన్సాలీ హామీ ఇచ్చారు.
హీరామండి తన ఇతర సినిమాల మాదిరిగానే ప్రేక్షకులకు కనెక్టవుతుంది. కథతో కలిసిపోయే ప్రత్యేకమైన సంగీతం ఆహ్లాదాన్ని పంచుతుందని తెలిపారు. దర్శకరచయిత భన్సాలీ మాట్లాడుతూ-”ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే శాశ్వతమైన మరపురాని కథలను రూపొందించాలంటే సృజనాత్మక స్వేచ్ఛ – కొత్త కాన్సెప్ట్ లతో ప్రయోగాలు చేయడం చాలా కీలకం. చరిత్రలో దాగిన కథలతో సినిమాలను రూపొందించడంలో కథకులను భాగస్వామ్యం చేయడంలో నెట్ ఫ్లిక్స్ ముందంజలో ఉంది” అని ప్రశంసించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సృష్టికర్తలతో కలిసి పని చేస్తున్నందుకు గర్విస్తున్నామని నెట్ ఫ్లిక్స్ ఇండియా సీఈవో ఈ సందర్భంగా అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ నిజమైన దూరదృష్టి గల దర్శకుడు. ఆయనతో కలిసి పని చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.