గోల్డ్ మెడల్స్ తో హ్యాట్రిక్ కొట్టిన సాయి పల్లవి


తమిళనాడులో పుట్టినా కూడా మలయాళ ముద్దుగుమ్మగా పేరు పడిన క్యూట్ బ్యూటీ సాయి పల్లవి ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేయకుండా ఆచితూచి తనకు సెట్ అయ్యే పాత్రలను.. తాను నమ్మిన సినిమాలను చేస్తూ ఉంటుంది. కమర్షియల్ పాత్రల పట్ల పెద్దగా ఆసక్తి చూపించని సాయి పల్లవి తాజాగా శ్యామ్ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

నాని హీరోగా నటించిన ఆ సినిమాలో సాయి పల్లవి ఒక దేవదాసి పాత్రలో కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర తక్కువే అయినా కూడా పూర్తిగా ఆమె సినిమాను తన భుజాలపై వేసుకుని మోసినట్లుగా సక్సెస్ చేసింది. సాయి పల్లవి వల్ల సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

దాంతో శ్యామ్ సింగరాయ్ సినిమా లోని ఆమె పాత్రకు పలు అవార్డులు రివార్డులు వస్తాయని అనుకున్నారు. అనుకున్నట్లుగానే సాయి పల్లవికి శ్యామ్ సింగరాయ్ కి గాను అవార్డు దక్కింది.

తాజాగా జరిగిన బిహైండ్ వుడ్స్ అవార్డుల వేడుకలో సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ సినిమాలోని అద్బుతమైన నటనకు బంగారు పతకం దక్కించుకుంది. సాయి పల్లవి బిహైండ్ వుడ్స్ లో అవార్డు దక్కించుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో రెండు సార్లు కూడా సాయి పల్లవి బంగారు పథకం ను దక్కించుకుంది. మొదటి సారి సాయి పల్లవి 2017 లో నటించిన కాళి సినిమాకు గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది.

ఇక 2019 లో మలయాళంలో ఫహద్ ఫాసిల్ తో కలిసి నటించిన అథిరన్ సినిమాకు గాను సాయి పల్లవి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకుంది. అథిరన్ సినిమాలో మానసికంగా సరిగా లేని అమ్మాయి పాత్రలో నటించి అద్బుతమైన తన నటన ప్రతిభను కనబర్చింది. సాయి పల్లవి ఆ సినిమాలో మరో లెవల్ ప్రదర్శణ చేసింది. ఇక మూడవ సారి శ్యామ్ సింగరాయ్ కి గాను గోల్డ్ మెడల్ ను దక్కించుకుంది.

ఒక సౌత్ హీరోయిన్ అతి తక్కువ సమయంలోనే మూడు గోల్డ్ మెడల్స్ ను దక్కించుకున్న దాఖలాలు లేవు. అద్బుతమైన అందమైన సాయి పల్లవి నటనకు మరో రెండు మూడు గోల్డ్ మెడల్స్ కూడా రావాల్సిందే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సాయి పల్లవి షేర్ చేసిన తాజా గోల్డ్ మెడల్ ఫోటోను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.