సాధారణంగా వేగం కుర్రాళ్లలో కనిపిస్తుంది. కానీ ఇక్కడ రివర్స్. చిరంజీవి..రజనీకాంత్ ..బాలకృష్ణ.. నాగార్జున..వెంకటేష్ తరం హీరోల్లో వాళ్లే కుర్రాళ్లైపోతున్నారు. అవును ఈ స్టార్ హీరోల వేగం అలాగే కనిపిస్తుంది. థర్డ్ జనరేషన్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేస్తుంటే? ఈ సీనియర్లంతా మాత్రం కనీసం ఏడాదికి రెండు సినిమాలైనా మార్కెట్ లో ఉండేలా చూసుకుంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిచ్చర పిడుగుల్లా దూసుకుపోతున్నారు. ఓసారి ఆ వివరాల్లోకివెళ్తే…
సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 72 ఏళ్లు. కానీ ఆయన వేగం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం రజనీ వరుసగా మూడు సినిమాలు ఒకేసారి చేస్తున్నారు. ‘జైలర్’ సెట్స్ లో ఉంగానే లాల్ సలామ్ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. ఈ రెండు సీరియస్ గా షూటింగ్ సాగుతుండగా ల్యాండ్ మార్క్ చిత్రం 170వ చిత్రాన్ని కూడా సూపర్ స్టార్ లాంచ్ చేసారు. తలైవార్ 170 అనే వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కించారు.
72 ఏళ్ల వయసులో రజనీ ఇలా ఒకదాని తర్వాత మరో సినిమా మొదలు పెట్టడం చూసి దక్షిణాది పరిశ్రమ షాక్ అయింది. ఆ మధ్య ఆరోగ్యం బాగోలేదని…రజనీ సినిమాలు చేసే అవకాశం లేదని కోలీవుడ్ మీడియాలో నానా యాగీ జరిగింది. కానీ రజనీ తాజ వేగం చూస్తుంటే? అవన్నీ గాలి మాటలేనని తేలిపోయింది. 170 కాదు..మరో 100 సినిమాల వరకూ రజనీ ఇదే మెరుపు వేగంతో సినిమా చేస్తారని చెప్పొచ్చు.
ఇక మెగాస్టార్ 67లోనూ అదే దూకుడు చూపిస్తున్నారు. గతేడాది ‘ఆచార్య’..’గాడ్ ఫాదర్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’తో మరో మాస్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఈసినిమాలు సెట్స్ లో ఉండగానే ‘భోళా శంకర్’ పట్టాలెక్కించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. కొత్త సినిమాలకు సంబంధించి చర్చలు సాగుతున్నాయి. రేపో..మాపో కొత్త సినిమా ప్రకటనొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అలాగే నటసింహ బాలకృష్ణ ఇటీవలే ‘అఖండ’..’వీరసింహారెడ్డి’ సినిమాలతో హిట్లు అందుకుని 108వ సినిమాతో మరో హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తున్నారు. 62 ఏళ్ల వయసులోనూ బాలయ్య అదే ఎనర్జీతో పనిచేస్తున్నారు.కెరీర్ ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలన్నది ఆయన ప్లాన్.
ఇక కింగ్ నాగార్జున..విక్టరీ వెంకటేష్ పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారు. వీళ్లిద్దరు కంటెంట్ ఉన్న చిత్రాల్లో నటించాలని ఆ తరహా కథల కోస వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రోసస్ లోనే కాస్త టైమ్ తీసుకుంటున్నారు. లేదంటే వీళ్ల వేగంగా మాములుగా ఉండదు. ఇద్దరు ఏడాదికి రెండు..మూడు సినిమాలైనా రిలీజ్ చేయాలని చూస్తుంటారు.