కరోనా కారణంగా కేంద్రం ముందస్తు ప్రకటన లేకుండా లాక్ డౌన్ పెట్టడంతో వలస కార్మికులు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. వారికి సాయంగా సోనూ సూద్ నిలిచాడు. వేలాది మంది వలస కార్మికులను వారి వారి గమ్య స్థానాలకు పంపడంలో సాయ పడ్డాడు. కోట్ల రూపాయలను ఖర్చు చేశాడు. ఆ తర్వాత కూడా తన మంచి పనులను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆపదలో ఉన్నాం అన్న ప్రతి ఒక్కరికి బాసటగా నిలుస్తున్న సోనూసూద్ తాజాగా ఒక చిన్నారి గుండెకు ఆపరేషన్ చేయించాడు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడి ఆ కుటుంబంకు ఆనందంను కలిగించాడు.
పశ్చిమగోదావరి జిల్లా అన్నదేవర పేటకు చెందిన రామన వెంకటేశ్వరరావు, దేవిలు వలస కూలీలు. వారి ఎనిమిది నెలల కుమారుడికి గుండెకు సమస్య వచ్చింది. దాంతో అతడిని కాపాడేందుకు సోనూసూద్ ముందుకు వచ్చాడు. ముంబయిలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో జాయిన్ చేయించి మొత్తం ఖర్చులు తానే భరించాడు. ఆ కుటుంబంకు ఒక పెద్దన్న మాదిరిగా సాయం చేసిన సోనూసూద్ మరోసారి రియల్ హీరో అనిపించుకున్నాడు.