డిజాస్టర్‌ పడ్డా తగ్గేదేలే..!

టాలీవుడ్ లో పలువురు హీరోలు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుని వరుసగా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అయితే దుల్కర్ సల్మాన్‌ మలయాళ నటుడు అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకుని, అన్ని భాష ల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్న విషయం తెల్సిందే.

తాజాగా కింగ్ ఆఫ్‌ కొత్త అనే భారీ సినిమా తో దుల్కర్‌ సల్మాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న దుల్కర్ సల్మాన్ కి తీవ్రంగా నష్టం తప్పలేదు. డిజాస్టర్‌ గా నిలిచిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా కు దాదాపుగా పాతిక కోట్ల నష్టం నిర్మాతకు వాటిల్లింది అంటూ మీడియా సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే దుల్కర్ సల్మాన్‌ జోరు ఏమాత్రం తగ్గలేదు.

సాధారణంగా ఏ భాష హీరోలు అయినా కూడా ఒక డిజాస్టర్ పడితే కాస్త బ్రేక్ తీసుకుని, అంతకు మించిన కథ, తప్పకుండా విజయాన్ని అందుకునే అవకాశం ఉన్న కథను పట్టుకుని రావాలి అనుకుంటారు. కానీ దుల్కర్ సల్మాన్ మాత్రం కింగ్‌ ఆఫ్ కొత్త సినిమా డిజాస్టర్ గురించి ఎలాంటి దిగులు లేకుండా బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం తెలుగు లో ప్రాజెక్ట్‌ కే సినిమాలో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇక తెలుగు లో డైరెక్ట్‌ గా ఒక సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు, త్వరలో పట్టాలెక్కబోతుంది. మరో వైపు దుల్కర్ సల్మాన్‌ హిందీ భాషలో కూడా సినిమాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక మలయాళంలో క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. మలయాళంలో రూపొందిన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడం కోసం డబ్బింగ్‌ చేస్తున్నారు. ఇక ముందు ముందు కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లో దుల్కర్ సల్మాన్‌ సినిమాలు ఉంటాయి. కింగ్‌ ఆఫ్ కొత్త వంటి డిజాస్టర్స్ పడ్డా కూడా తగ్గేదే లే అన్నట్లుగా దుల్కర్ దూసుకుపోతున్నాడు.