వెటరన్ నటి లైలా ఒకప్పుడు ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. `ఎగిరేపావురమా` తో టాలీవుడ్ కి పరిచయమైన లైలా చాలా సినిమాల్లో నటించింది. తమిళ..మలయాళ..కన్నడ భాషల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకుంది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఓ బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకున్నారు. అటుపై సినిమాలకు దూరమయ్యారు. కుటుంబ జీవితంలో అంకితమై మళ్లీ సినిమాల వైపు వచ్చింది లేదు. అయితే ఆ మద్య `సర్దార్` సినిమాతో మళ్లీ తమిళ్ లో కంబ్యాక్ అయ్యారు.
ప్రస్తుతం అక్కడ `శబ్దం` అనే సినిమా చేస్తున్నారు. అవకాశం వస్తే తెలుగు సినిమాల్లోనూ నటించాలని ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో పాటు కొన్ని కుటుంబ బాధ్యతలు తగ్గాయి. ఈనేపథ్యంలో లైలా మళ్లీ మ్యాకప్ వేసుకుంటున్నారు. తాజాగా ఆమె ఓ యూ ట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిర విషయాలు పంచుకున్నారు. ఏకంగా దర్శకుడు బాలతోనే లైలా ఆవేశంతో తగాదాకి దిగినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు అడిగారు అనుకోండి. ఆవేంటో ఆమె మాటల్లోనే.. `2001 లో `నందా` సినిమా చేసాను. అప్పటికి నాకు సరిగ్గా తమిళ్ రాదు. చాలా తప్పులొచ్చేవి. డైలాగులు సరిగ్గా చెప్పలేకపోయేదాన్ని. దీంతో డైరెక్టర్ బాల పదే పదే తిట్టేవారు. అలా తిట్టడంతో నాకు బాగా కోపం వచ్చేది. కానీ అలా చాలాసార్లు కోపాన్ని అదిమి పెట్టా. కానీ ఓ రోజు మాత్రం పట్టలేనంత కోపం వచ్చేసింది. దీంతో దర్శకుడు ముందే అరిచేసా. సినిమా చేయనని బిగ్గరగా చెప్పాను.
అప్పుడు నా దగ్గరకు కొంత మంది వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. బాలా దర్శకత్వంలో పనిచేస్తే మంచి పేరు..గుర్తింపు వస్తుందని బ్రతిమలాడారు. నా లైఫ్ గురించి వాళ్లు అంతగా చెప్పడంతో అప్పటితో నా ఆవేశాన్ని తగ్గించుకున్నాను. అప్పుడు అలా ఉండటం నిజంగా నాకు ఎంతో పేరు తీసుకొచ్చింది. నందా రిలీజ్ రోజు థియేటర్ కి వెళ్లాడను. అక్కడ ప్రేక్షకులు హడావుడి..అరుపులు..కేకలు చూసి సర్ ప్రైజ్ అయ్యాను. తెరపై నేను ఇంత బాగా నటించానా? అన్న సందేహం నాకే కలిగింది. అది చూసి నేను షాక్ అయ్యాను. వెంటనే బాల దగ్గరకు వెళ్లి ఆయన కాళ్ల మీద పడి క్షమాపణలు అడిగాను. మీ కోపం ఎందుకో నాకు ఇప్పుడు అర్ధమైంది అన్నాను. ఆ సినిమాకి గానూ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకు న్నాను` అని అన్నారు.