తెలుగు తెరకు మరో నాజూకు సుందరి!

తెలుగు తెరకి ఎప్పటికప్పుడు ఎంతోమంది కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. తమ అందచందాలతో .. అభినయంతో ఆకట్టుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందం .. అభినయంతో పాటు అదృష్టం కలిసొచ్చినవారు ఇక్కడ ఒక వెలుగు వెలుగుతారు. లౌక్యం కూడా తెలిసినవాళ్లు ఎక్కువకాలం పాటు ఏలేస్తారు. ఇలా ఎవరి టాలెంటును బట్టి వాళ్లు ఇక్కడ రాణిస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ రేసులో అడుగుపెట్టడానికే ఆసక్తిని చూపుతుంటారు.

ఈ మధ్య కాలంలో తెలుగు తెరపై సంక్రాంతి ముగ్గులా పరుచుకున్న హీరోయిన్ ఏవారైనా ఉన్నారంటే .. అది కృతి శెట్టి మాత్రమేనని చెప్పాలి. ఆ అమ్మాయి వచ్చిన వేళ విశేషం వలన తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. వెంటవెంటనే మూడు ప్రాజెక్టులను తన హ్యాండ్ బ్యాగులో వేసేసుకుంది. ఈ అమ్మాయిని అందుకోవడానికి అనన్య పాండే .. కేతిక శర్మ .. మీనాక్షి చౌదరి వంటి కుర్ర హీరోయిన్లు ఆరాటపడ్డారుగానీ కరోనా కాలు అడ్డుపెట్టేసింది. దాంతో వీరి ఫస్టు సినిమాలన్నీ వెయిటింగ్ లిస్టులోకి వెళ్లిపోయాయి.

ఈ నేపథ్యంలోనే తెలుగు తెరకి పరిచయం కావడానికి మరో కొత్త అమ్మాయి సిద్ధమైపోయింది. ఆ అమ్మాయి పేరే .. ‘తాన్య రవిచంద్రన్’. సన్నజాజి మొగ్గలా నాజూకుగా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడే తమిళంలో కుదురుకోవడానికీ .. అక్కడి కుర్రాళ్లకు కుదురులేకుండా చేయడానికి ట్రై చేస్తోంది. తెలుగులో కార్తికేయ హీరోగా చేస్తున్న ‘రాజా విక్రమార్క’ సినిమా ద్వారా ఈ పిల్ల పరిచయమవుతోంది. ఈ నవంబర్ లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొంటె చూపులతో గారడీ చేసే ఈ కోల కళ్ల పిల్ల ఇచ్చే పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి మరి!