నిరంతర ప్రజాకార్యక్రమాలు, పార్టీ కార్యకలాపాలతో తలమునకలుగా ఉండే రాజకీయ నాయకులు సినీతారల కోసం సమయం కేటాయించడం చాలా అరుదైన విషయం. సాక్షాత్తూ దేశ ప్రధాని ఇప్పుడు సినిమా స్టార్లతో సమావేశం కోసం సమయం కేటాయించారు. అయితే ఈ సమావేశానికి అంతటి ప్రాధాన్యత ఉందా?
ఈ మంగళవారం నాడు కపూర్ కుటుంబ సభ్యులు – ఖాన్‌లు.. ఇతర బాలీవుడ్ తారలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం కోసం న్యూఢిల్లీకి వెళ్లారు. రాజ్ కపూర్ 100వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీతో చర్చించేందుకు వీరంతా వెళ్లారని సమాచారం. దేశంలోని పలు మెట్రో నగరాల్లో కపూర్ చలనచిత్రోత్సవం జరగడానికి ముందు మోదీతో గౌరవ సమావేశమిదని తెలిసింది. భారతీయ సినీరంగంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా రాజ్ కుమార్ పేరు సుస్థిరమైంది. రాజ్ కపూర్ శతదినోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని కపూర్ కుటుంబ సభ్యులు ఆహ్వానించారని సమాచారం.
RK ఫిల్మ్ ఫెస్టివల్ ఈ వారంలో 34 నగరాల్లోని 101 సినిమా థియేటర్లలో జరుగుతుంది. భారీ వేడుకల సందర్భంగా రాజ్ కపూర్ క్లాసిక్ సినిమాలను రీమాస్టరింగ్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తున్నారు. డిసెంబరు 13 నుండి డిసెంబర్ 15 వరకు వివిధ నగరాల్లోని పివిఆర్-ఐనాక్స్ , సినీపోలిస్ సినిమా థియేటర్లలో కపూర్ సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవంలో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శిస్తారు. ఆగ్, బర్సాత్, ఆవారా, శ్రీ 420, జాగ్తే రహో, జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై, సంగం, మేరా నామ్ జోకర్, బాబీ , రామ్ తేరీ గంగా మైలీ ప్రధానంగా ప్రదర్శించే చిత్రాలు అని తెలిసింది. ప్రధానిని కలిసిన వారిలో పలువురు బాలీవుడ్ తారలు ఉన్నారు.
రణబీర్ కపూర్, అలియా భట్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ , సైఫ్ అలీ ఖాన్ సహా కుటుంబంలోని పలువురు సభ్యులు దిల్లీలో ప్రధానిని కలిసారు. ఆదార్ జైన్ అతడి తండ్రి మనోజ్ జైన్, అనిస్సా మల్హోత్రా కూడా మోదీతో సమావేశమయ్యారు.