దేవతల జాబితాలో చేరిన సమంత

సినిమా స్టార్స్ ను ప్రేక్షకులు అభిమానులు దేవుళ్లుగా పూజించడం తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా కనిపిస్తూనే ఉంటుంది. హీరోలకు పాలాభిషేకాలు.. పూలాభిషేకాలతో పాటు పూజలు చేసే అభిమానులు ఉన్న మన దేశంలో హీరోయిన్స్ కు గుడి కట్టడం కూడా చూశాం. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్స్ కు గుడి కట్టిన సందర్భాలు ఉన్నాయి.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తికి గుడి కట్టడం అనేది ఖుష్బూ నుండి మొదలు అయ్యింది. ఖుష్బూ కు మొదట అభిమానులు గుడి కట్టారు. ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ కు కూడా గుడి కట్టి పూజించారు. దేవతలుగా మారిన హీరోయిన్స్ జాబితాలో ఖుష్బూ.. హన్సిక.. నమిత.. నిధి అగర్వాల్ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రమే కాకుండా కొందరు హీరోలకు ఇతర సినీ సెలబ్రిటీలకు కూడా గుడి కట్టడం జరిగింది.

తాజాగా దేవతల జాబితాలో మరో హీరోయిన్ సమంత కూడా చేరింది. బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ అనే వ్యక్తి సమంత కోసం గుడి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆ గుడిని ఆమె బర్త్ డే సందర్భంగా ప్రారంభించబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

సమంత ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయ్యింది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సమంత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. హీరోయిన్ గా సమంత ఏడాదికి రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తూ దూసుకు పోతుంది.

సమంత పై అభిమానంతో ఆలపాడు సందీప్ చేస్తున్న పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సమంతకు తెలుగు రాష్ట్రం లో గుడి కట్టబోతున్న నేపథ్యంలో ఆలపాడు గురించి ప్రముఖంగా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.