నటసింహా నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ రాక కోసం అభిమానులు వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. ఐదారేళ్లుగా.. అతడి గురించి ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్నచందంగానే వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ మోక్షజ్ఞ సినీఆరంగేట్రంపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
ఇంతకుముందు మోక్షజ్ఞ `ఆదిత్య 369` సీక్వెల్ కథాంశంతో తెరకు పరిచయమవుతాడని ప్రచారమైంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని కూడా ఎన్బీకే స్వయంగా రివీల్ చేసారు. ఈ చిత్రానికి తాను దర్శకత్వం వహించడమో లేక ఎవరైనా యువదర్శకుడికి అవకాశం కల్పించడమో జరుగుతుందని కూడా బాలయ్య అన్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తారని అన్నారు. కానీ అది సాధ్యపడలేదు.
అయితే కొన్నాళ్లకు మోక్షజ్ఞ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించే అవకాశం ఉందని కూడా మీడియాలో కథనాలొచ్చాయి. మోక్షజ్ఞ క్యూలో పలువురు దర్శకులు ఉన్నారని కూడా గుసగుసలు వినిపించాయి. బోయపాటి, అనీల్ రావిపూడి, గోపిచంద్ లాంటి దర్శకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం కథలు రెడీ చేసారని కూడా టాక్ వినిపించింది. కానీ వీళ్లలో ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు మరోసారి మాస్ డైరెక్టర్ బోయపాటి పేరు వినిపిస్తోంది.
మోక్షజ్ఞ డెబ్యూ చిత్రానికి బోయపాటి స్క్రిప్టును రెడీ చేసారని, దీనిపై బాలయ్యతో చర్చిస్తున్నారని ఇప్పుడు మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిని నందమూరి కాంపౌండ్ అధికారికంగా ధృవీకరించలేదు. అయితే మాస్ డైరెక్టర్ మోక్షజ్ఞ ను కమర్షియల్ ఎంటర్ టైనర్ తో లాంచ్ చేస్తే బావుంటుందని ఎన్బీకే అభిమానులు భావిస్తున్నారు. అయితే మోక్షజ్ఞ లాంచింగ్ గురించి బాలకృష్ణ కాంపౌండ్ నుంచి అధికారికంగా సమాచారం వెలువడాల్సి ఉంది.