భారతీయ సినీ ప్రేక్షకుల అభిరుచి ఫుల్ గా మారిపోయిన విషయం తెలిసిందే. సాధారణ సినిమాలతో పోల్చి చూస్తే విజువల్ వండర్స్ గా తెరకెక్కిన చిత్రాలకు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారనే చెప్పాలి. అయితే నాసిరకమైన గ్రాఫిక్స్ తో రూపొందుతున్న సినిమాలను మూవీ లవర్స్ పెద్దగా ఆదరించడం లేదు. గ్రాఫిక్స్ బాలేకపోతే.. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
గతంలో చిరంజీవి ఆచార్య సినిమా విషయంలో ఇదే జరిగింది. మెగాస్టార్ యంగ్ లుక్ ను డీ-ఏజింగ్ టెక్నాలజీ సాయంతో డైరెక్టర్ కొరటాల శివ క్రియేట్ చేశారు. రిలీజైన రోజు నుంచి చిరు లుక్ మీద ఫుల్ ట్రోల్స్ వచ్చాయి. ఇక మూవీ కూడా డిజాస్టర్ కావడంతో ట్రోల్స్ మరింత ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు అదే డీ-ఏజింగ్ టెక్నాలజీతో నాగ్ అశ్విన్.. కల్కి మూవీలో అమితాబ్ యంగ్ లుక్ ను సృష్టించారు.
ఇటీవల బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను కల్కి మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ గ్లింప్స్ లో అమితాబ్ ను యంగ్ లుక్ లో చూపించడం పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గ్లింప్స్ లో ఓ షాట్ లో అమితాబ్ యంగ్ లుక్ లో కనిపిస్తారు.
ఆ లుక్ లో అచ్చం అమితాబ్ యువకుడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో సేమ్ టు సేమ్ అలాగే ఉన్నారు. దీంతో డీ- ఏజింగ్ టెక్నాలజీని నాగ్ అశ్విన్ అద్భుతంగా ఉపయోగించారని అంతా కొనియాడుతున్నారు. సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచడంలో కూడా సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఇదిరా గ్రాఫిక్స్ అంటే, సినిమా అంతా ఇలా ఫుల్ క్వాలిటీగా ఉండాలని నాగ్ అశ్విన్ ను కోరుతున్నారు. గ్లింప్స్ లో అమితాబ్ షాట్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్నాయి. చేతులపై యుద్ధ మరకలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో డీ-ఏజింగ్ కోసమే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీకి ఈ టెక్నాలజీ కొత్త హోప్ ఇచ్చిందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. సీనియర్ హీరోలను యంగ్ లుక్ లో చూపించే సన్నివేశాలు, కథలను మేకర్స్ ఇక దర్జాగా రాసుకోవచ్చని అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలో కొత్త ఆశలు కలిగిస్తుందని చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడినా వీరు ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగలరని, ఇప్పుడు డీ-ఏజింగ్ టెక్నాలజీతో దూసుకుపోతారని అంటున్నారు. మరి ఈ టెక్నాలజీ ఫ్యూచర్ లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.