ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మూవీ కోసం అభిమానులంతా కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు! నార్త్ ఇండియన్స్ అయితే ఏకంగా రోజులు కౌంట్ చేసుకుంటున్నారట. పుష్ప రాజ్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు తహతహలాడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో గత కొద్దిరోజులుగా పుష్ప-2 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూనే ఉంది.
ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. పుష్ప-2 టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించిన మేకర్స్.. డైలీ కౌంట్ డౌన్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ లుక్స్ కు రెస్పాన్స్ వేరే లెవల్ లో వచ్చింది. ఇప్పుడు టీజర్ తో బన్నీ పెను సంచలనమే సృష్టించేటట్టు కనిపిస్తున్నారు. ఇంతలో నటి అనసూయ తన పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది.
పుష్ప పార్ట్-1లో దాక్షాయణి రోల్ లో కనిపించింది అనసూయ. సిండికేట్ హెడ్ మంగళం శ్రీను భార్యగా నటించిన అనసూయ.. సీక్వెల్ లో విలన్ గా యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మూవీ టీమ్ తో దిగిన క్రేజీ సెల్ఫీ పోస్ట్ చేసింది. అందులో అనసూయతో పాటు ఫహాద్ ఫాజిల్, బ్రహ్మజీ, సుకుమార్, సునీల్ ఉన్నారు. సుక్కూ తప్ప మిగతా ముగ్గురు కూడా పుష్పలో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.
మంగళం శ్రీనుగా సునీల్, షెకావత్ గా ఫహాద్ ఫాజిల్, కుప్ప రాజుగా బ్రహ్మాజీ సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. అయితే తన పోస్ట్ కు క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది అనసూయ. “దేశం మొత్తం.. బహుశా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పుష్ప-2 ది రూల్ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఇక్కడ మేం దాని కోసమే ప్లాన్ చేస్తున్నాం” అంటూ రాసుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పుష్ప-1కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు సుకుమార్. పలు సీన్లను రీషూట్ కూడా చేశారు. ఓవైపు షూటింగ్ నిర్వహిస్తూనే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేస్తున్నారు. ఎలా అయినా చెప్పిన తేదీకే సినిమాను విడుదల చేయాలని హార్డ్ వర్క్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి.