దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఫ్యాన్స్ విషయంలో కొదవ లేదు. ప్రతీ స్టార్ హీరో అభిమాని పూరిని కూడా అభిమానిస్తాడు. తమ హీరోకు పూరి ప్లాప్ ఇచ్చినా సరే మరోసారి తనతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని ఆశిస్తారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తే వారి డిక్షన్, డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ దగ్గరనుండి ప్రతీదీ మార్చేస్తాడు దర్శకుడు. ముఖ్యంగా హీరోలను సరికొత్త మాస్ యాంగిల్ లో చూపించమంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా.
రెబెల్ స్టార్ ప్రభాస్ తో కూడా పూరి జగన్నాథ్ రెండు సినిమాలు చేసాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన విజయాల్ని సాధించలేదు. అయినా కూడా ప్రస్తుతం ప్రభాస్ – పూరితో ఒక కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ చేయాలని ఆశిస్తున్నారు. ఈరోజుతో బుజ్జిగాడు విడుదలై 12 సంవత్సరాలు అయింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్ పై మరోసారి చర్చ మొదలైంది. బుజ్జిగాడు అనుకున్న రేంజ్ లో విజయం సాధించకపోయినా కూడా ప్రభాస్ కెరీర్ లో ఇది చాలా స్పెషల్ మూవీ. తన నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అన్నీ ఈ సినిమాతో మారిపోయాయి.
మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరిద్దరి కాంబోలో సినిమా సాధ్యమా అంటే ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడన్నీ ప్యాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ఓ డియర్ చేస్తున్న ప్రభాస్, తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు. ఇవన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండున్నరేళ్లు పడుతుంది. అప్పటికి పరిస్థితులు ఎంతలా మారతాయో చెప్పలేం.