సలార్, కల్కి సినిమాల సూపర్ హిట్ నేపథ్యంలో ప్రభాస్ తదుపరి సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే రాజాసాబ్ సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు సీతారామం వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా ను చేయబోతున్నాడు. ఆగస్టు 17న సినిమా ప్రకటన ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఫౌజీ సినిమా హీరోయిన్ గురించి గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన హను రాఘవపూడి మరోసారి ఆమెతో వర్క్ చేయాలని భావిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ప్రభాస్ తో ఫౌజీ సినిమాలో మృణాల్ నటించబోతుందని, అందుకే ఆమెను కల్కి లో చిన్న పాత్ర కోసం తీసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ తాను ప్రభాస్ తో సినిమాను చేయడం లేదని, ఇప్పటివరకు తన వద్దకు అలాంటి ఆఫర్ రాలేదని, ఆయనతో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
మృణాల్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్ కు జోడీగా మరో హీరోయిన్ నటించబోతుంది. ఆమె ఎవరు అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభాస్ ఫౌజీ సినిమా కోసం హీరోయిన్ విషయంలో చర్చలు జరిగాయా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అనేక రకాలుగా ప్రచారం జరుగుతోంది. మృణాల్ తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చిన వెంటనే చాలా మంది ప్రభాస్ కి జోడీ త్రిష నటించబోతుందనే ప్రచారం మొదలు పెట్టారు. ప్రస్తుతం చిరంజీవికి జోడీగా త్రిష విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
చాలా కాలంగా త్రిష తెలుగు లో కంటే ఎక్కువగా తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఆమె కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. కానీ ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను తమిళంలో చేస్తూ వచ్చింది. ఇప్పుడు తెలుగు లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. చిరంజీవి తో విశ్వంభర సినిమాను ముగించక ముందే ప్రభాస్ తో సినిమాకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. త్రిష తో గతంలో ప్రభాస్ వర్షం, పౌర్ణమి మరియు బుజ్జిగాడు సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. వీరిద్దరిది హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. కనుక వీరి కాంబోలో ఫౌజీ వస్తే కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.