నటీనటులు: సాయి రోనక్, ప్రీతి అస్రాని, రాహుల్ రామకృష్ణ..
నిర్మాత: సుజోయ్ – సుశీల్ – అప్పి రెడ్డి
దర్శకత్వం: సుజోయ్ – సుశీల్
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్ – అనిత్ మాదాడి
మ్యూజిక్: సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న
రన్ టైం: 2 గంటల 14 నిముషాలు
విడుదల తేదీ: ఫిబ్రవరి 21, 2020
ఈ మధ్య తల్లి తండ్రుల ఆశలన్నీ అమెరికా వైపే ఉంటున్నాయి, చాలా మంది అమెరికా చూపించే పిల్లల్ని పెంచుతున్నారు. దాదాపు ఎక్కువమంది జరిగే ఇళ్లలో జరిగే ఇదే ఇతి వృత్తాన్ని కథగా తీసుకొని యంగ్ డైరెక్టర్స్ సుజోయ్ – సుశీల్ అండ్ టీం కలిసి చేసిన ప్రయత్నమే ‘ప్రెషర్ కుక్కర్’. మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా మేము స్పెషల్ ప్రీమియర్ చూసాము. మరి రియల్ లైఫ్ ఎక్స్ ప్రీరియన్స్ లతో రూపొందిన ఈ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పించిందో ఇప్పుడు చూద్దాం..
కథ:
నరసింహా రావు తన కుమారుడు కిషోర్(సాయి రోనక్) లక్ష్యం అమెరికా వెళ్లడమే అని చిన్నప్పటి నుంచీ చెప్పి పెంచుతాడు. గ్రాడ్యువేషన్ తర్వాత యుఎస్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చెయ్యాలనుకున్న కిషోర్ కి వీసా రిజెక్ట్ అవుతుంది. ఎలాగైనా తండ్రి కోరిక తీర్చాలని హైదరాబాద్ కి వచ్చి వీసా కోసం పలు ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దాంతో హైదరాబాద్ లోనే ఒక జాబ్ లో చేరతాడు, అదే టైంలో అనిత(ప్రీతి అస్రాని)తో ప్రేమలో పడతాడు. కానీ తన వర్క్ వల్ల ఫైనల్ గా కిషోర్ కి అమెరికా వీసా వస్తుంది. ఆ టైంలో తన ప్రేమని వదులుకొని, తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం యుఎస్ వెళ్లాడా? లేదా? అటు ప్రేమ – ఇటు తండ్రి కోరిక మధ్య కిషోర్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నాడు అనేదే ఈ ప్రతి ఇంట్ల ఇదే లొల్లి అనే టాగ్ లైన్ తో వచ్చిన ప్రెషర్ కుక్కర్ కథ.
తెర మీద స్టార్స్..
తెరపై ది బెస్ట్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ ప్రీతి అస్రాని.. ‘మళ్ళీ రావా’లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించిన ప్రీతి ఇందులో చేసిన అనిత పాత్రకి పూర్తి న్యాయం చేసింది. లవ్ సీన్స్ లో తన హావ భావాలు సింప్లీ సూపర్బ్. సినిమాలో తన ఒక్క పాత్ర డిజైనింగ్ మాత్రమే పర్ఫెక్ట్ గా ఉంది. సాయి రోనక్ ఎటు డెసిషన్ తీసుకోవాలో తెలియక ఫుల్ ప్రెషర్ లో ఉండే పాత్రలో బాగా చేసాడు. ఎమోషనల్ సీన్స్ లో ఓకే కానీ ఇంకా బెటర్ గా చేయగలిగే ఛాన్స్ కూడా ఉంది. సీనియర్ నటీనటుల్లో తనికెళ్ళ భరణి నటన కథలోని కీ పాయింట్ ని ఎలివేట్ చేయడానికి బాగా హెల్ప్ అయ్యింది. సివిల్ నరసింహారావు నటన కూడా ఉన్నంతలో బాగుంది. హీరో ఫ్రెండ్స్ అండ్ కామెడీ కోసం పెట్టిన రాహుల్ రామకృష్ణ – రాజై రోవన్ పాత్రలు పెద్దగా కామెడీని పంచలేకపోయాయి. మిగిలిన పాత్రలు ఉన్నంతలో జస్ట్ ఓకే అనిపిస్తాయి.
తెర వెనుక టాలెంట్..
నగేష్ బానెల్ – అనిత్ మాదాడి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా లవ్ ట్రాక్ లో తన విజువల్స్ మంచి ఫీల్ ని కలిగిస్తాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపధ్య సంగీతం బాగుంది. అలాగే సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరన్ అందించిన సాంగ్స్ కూడా బాగున్నాయి. నరేష్ రెడ్డి జొన్న ఎడిటింగ్ పార్ట్స్ పార్ట్స్ గా బాగున్నా సినిమాని బతికించలేకపోయాడు. ఎందుకంటే సినిమా మొదటి నుంచి ఎక్కడా స్పీడ్ అందుకోదు, చాలా స్లోగా నడుస్తుంది. చాలా చోట్ల జంప్ కట్స్ కనిపిస్తాయి. ముఖ్యంగా సినిమా ఎక్కడ మొదలవుతుందో ఇంటర్వల్ కికుడా అక్కడే ఉంటుంది. కథ పెద్దగా ముందుకెళ్ళదు. ఇలాంటి ఎమోషనల్ డ్రామాకి డైలాగ్స్ చాలా కీలకం, కానీ ఏ సందర్భంలోనూ చెప్పుకునే స్థాయి డైలాగ్స్ లేవు.
ఇక యంగ్ టాలెంట్ అయిన సుజోయ్ – సుశీల్ విషయానికి వస్తే..వీళ్ళు యుఎస్ రిటర్న్ కావడం వలన వీరి జీవితంలోని అనుభవాలనే స్టోరీ పాయింట్ గా ఎంచుకున్నారు. ఈ పాయింట్ ని ఎవరు ముందు రాశారు అనే పాయింట్ ని పక్కన పెడితే, ఇదే స్టైల్ ఎమోషనల్ కథని కాస్త ఇమేజ్ ఉన్న హీరోలు ‘ప్రతిరోజూ పండగే’, ‘శతమానంభవతి’ లాంటి సినిమాలలో చెప్పేయడం మొదటి మైనస్. అలాగే ప్రతిరోజూ పండగే రీసెంట్ గా వచ్చి హిట్ అయ్యి ఇంకా ప్రేక్షకులకి గుర్తుండడం వలన ఈజీ గా కంపార్ చేసేస్తారు.. పోనీ అలా కాకుండా వీళ్ళు పూర్తిగా నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ ని టచ్ చేసుంటే చాలావరకూ సేఫ్ అయ్యేవారు కానీ అదీ జరగలేదు. మొదటి నుంచి సీరియస్ నోట్ లోనే వెళ్ళడం యంగ్ డైరెక్టర్స్ చేసిన మరో మిస్టేక్. రైటర్స్ గా ఇద్దరూ పాత్రల ఆర్క్స్ సరిగా డిజైన్ చేసుకోలేదు. ముఖ్యంగా హీరో పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది, కానీ ఆ పాత్రే సరిగా డిజైన్ చేయలేదు. మరీ అంత క్లూ లెస్ గా హీరో ఉన్నాడేంటి అనే ఫీలింగ్ ప్రేక్షకులకి వస్తుంది. అలాగే పాత్రల్లో వచ్చే మార్పుకు సంబందించిన సీన్స్ బలంగా లేవు. ఇక స్క్రీన్ ప్లే పరంగా అయినా బోర్ లేకుండా స్పీడ్ అండ్ షార్ప్ గా ఉండేలా చూస్కోవాల్సింది. కానీ అదీ లేకపోవడం వలన సినిమా ఇక ముందుకు వెళ్లదా అనే ఫీలింగ్ వస్తుంది. దర్శకులుగా మాత్రం కొన్ని సీన్స్ తీయడంలో, లవ్ ట్రాక్ లో బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే రాసుకోగలితే మంచి మూవీ ఇచ్చే టాలెంట్ అయితే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
విజిల్ మోమెంట్స్:
– ప్రీతి అస్రాని పెర్ఫార్మన్స్
– సెకండాఫ్ లోని ఎమోషనల్ సీన్స్
బోరింగ్ మోమెంట్స్:
– ఇదే కథని ఇటీవల వచ్చిన హిట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’ లో చూసెయ్యడం
– స్లో నెరేషన్
– అనుకున్న కామెడీ వర్క్ అవ్వకపోవడం
– బోరింగ్ ఫస్ట్ హాఫ్
– పాత్రల డిజైనింగ్ సరిగా లేకపోవడం
– క్లైమాక్స్ బెటర్ గా ఉండాల్సింది
విశ్లేషణ:
‘ప్రెషర్ కుక్కర్’ – ప్రతి ఇంట్ల ఇదే లొల్లి అనే టాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్ లో చూసే వారి సహనానికి పెద్ద పరీక్షనే చెప్పాలి. చాలా మంది యువత కనెక్ట్ అయ్యే పాయింటే కానీ యూత్ ఆధ్యంతం ఎంజాయ్ చేసేలా సినిమా లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్. బాగుందనిపించే నటీనటుల పెర్ఫార్మన్స్, ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్ కోసం ఈ 134 నిమిషాల సినిమాని చూడడం కాస్త కష్టమే సుమీ..
ఇంటర్వల్ మోమెంట్: ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని ఫీలవుతున్న టైంలో వచ్చిన బ్రేక్ ఇచ్చిన ఆనందమే వేరు..!
ఎండ్ మోమెంట్: గుడ్ పాయింట్, కానీ ఇంతకన్నా బెటర్ అవుట్ ఫుట్ తో వచ్చిన సినిమాలు ఇది వరకే చూసేసాం కదా.!
చూడాలా? వద్దా?: యుఎస్ వెళ్ళమని పీడించే పేరెంట్స్ ఉంటే వారికి తప్పక చూపించండి.
బాక్స్ ఆఫీస్ రేంజ్:
స్మాల్ బడ్జెట్ తో రూపొందిన ‘ప్రెషర్ కుక్కర్’ ట్రైలర్ తో ఆకట్టుకుంది, కానీ సినిమాగా పెద్దగా మెప్పించలేకపోయింది. అదీ కాక ఒక స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాకి పోటీగా రిలీజయ్యింది. కాబట్టి ఈ కాంపిటీషన్ లో అటు ఇటుగా ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ ఫుల్ రికవరీ కష్టమనే చెప్పాలి.
గమనిక: మా బాక్స్ ఆఫీస్ రేంజ్ అనేది సినిమా రేటింగ్ మీదే పూర్తిగా డిపెండ్ అవ్వకుండా హీరో స్టార్డం, భారీ రిలీజ్ మరియు రిలీజ్ అయిన సీజన్ ని కూడా కలుపుకొని చెబుతాం.