ప్రస్తుతం కరోనా మహమ్మారి ఇండియాని అతలాకుతలం చేస్తోంది. రోజుకి దాదాపు 15వేల కేసుల వరకూ నమోదవుతున్నాయి. దేశంతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. అందువలనే జూన్ 15 నుంచి షూటింగ్స్ కి అనుమతి లభించినా సినిమా షూటింగ్ లు మాత్రం ప్రారంభం కాలేదు. కానీ టాలీవుడ్ కి కరోనా సెగ మొదలైంది.
జూన్ 19న తెలంగాణాలో మొత్తంగా 499 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో టాలీవుడ్ యాక్టర్, నిర్మాత, రాజకీయ నాయకుడు అయిన బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయన ట్రీట్మెంట్ కోసం ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారని సమాచారం. అలాగే అయన భార్య పిల్లలకి కూడా టెస్ట్ లు నిర్వహించారు. దానికి సంబందించిన రిపోర్ట్స్ రావాల్సి ఉంది.
బండ్ల గణేష్ కి పౌల్ట్రీ బిజినెస్ తో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. దానివల్ల ఆయన పలు చోట్లకి తిరగడం వలనే ఇలా జరిగుండవచ్చని సన్నిహితులు అంటున్నారు. బండ్ల గణేష్ నివాసముండే గేటెడ్ కమ్యూనిటీలోనే హీరో నాగశౌర్య ఫ్యామిలీ, కళామందిర్ కళ్యాణ్ కుటుంబంతో పాటు పలువురు ప్రముఖుల ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. బండ్ల గణేష్ ఫ్యామిలీ వల్ల ఇప్పుడు అక్కడి వారంతా టెస్ట్ లు చేసుకునే అవకాశం ఉంది.
అంతే కాకుండా జూన్ 19న రిజిస్టర్ అయిన కోవిడ్ కేసుల్లో వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్లోని మెడికల్ స్టాఫ్ 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అలాగే నలుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ కి, క్రైమ్ డిపార్ట్మెంట్ ఏడీజీకి, స్పెషల్ బ్రాంచ్ జాయింట్ సీపీకి, ట్రాఫిక్ డిఫార్ట్మెంట్ డీసీపీకి, మరో నార్త్ జోన్ పోలీస్ ఆఫీసర్ కి కూడా కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది.