కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన కన్నడ స్టార్ హీరో యశ్ పుట్టిన రోజు ఈరోజు (జనవరి 8). ఈ సందర్భంగా అతని అభిమానులు అన్ని చోట్లా సంబరాలు జరుపుకున్నారు. అయితే, కర్ణాటకలోని గదగ్ జిల్లాలో యశ్ బర్త్ డే బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు అభిమానులు విద్యుత్ షాక్ కు గురై మరణించారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సురంగి గ్రామంలోని యశ్ ఫ్యాన్ క్లబ్‌కు చెందిన హనమంత హరిజన్ (21), మురళీ నాద వినమణి (20), నవీన్ గాజి (19) అనే ముగ్గురు అభిమానులు బ్యానర్‌ను ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ కు గురయ్యారు. దీంతో వారు అక్కడికక్కడే మరణించారు. మరో మూడుగురు అభిమానులు మంజునాథ్ హరిజన్, ప్రకాష్ మాగేరి, దీపక హరిజన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ ఘటనపై అభిమానులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. యశ్ తమ స్నేహితుల కుటుంబాలను ఓదార్చాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే చంద్రు లమాని ఆస్పత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
యశ్ ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న ఆయన త్వరగా తిరిగి వచ్చి స్నేహితుల కుటుంబాలను ఓదార్చాలని అభిమానులు కోరుతున్నారు.