సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘చంద్రముఖి’. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో జ్యోతిక టైటిల్ పాత్రలో నటించి వెన్నులో వణుకు పుట్టించింది. నయనతార హీరోయిన్ గా నటించినా రజనీ సినిమాలో వున్నా కానీ జ్యోతిక తనదైన మార్కు నటనతోమొత్తం మార్కులు కొట్టేసింది. పెద్ద పెద్ద కళ్లతో హావ భావాల్ని పలికిస్తూ చంద్రముఖి పాత్రని అద్భుతంగా పోషించింది. 2005లో నటుడు ప్రభు కీలక పాత్రలో నటించి ఈ మూవీరని నిర్మించారు.
అప్పటి వరకు వరుసఫ్లాపుల్లో వున్న రజనీ కెరీర్ ని ఈ సినిమానే మళ్లీ గాడిలో పెట్టి తమిళ తెలుగు భాషల్లో తిరుగులేని బ్లాక్ బస్టర్ ని అందించింది. అక్కడి నుంచి తలైవా వెనుదిరిగి చూసుకోలేదు. ఒక విధంగా చెప్పాలంటే రజనీకి ఈ మూవీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి రజనీ కెరీర్ ని మలుపు తిప్పిన ఈ మూవీ విడుదలై దాదాపు పద్దెనిమిదేళ్లవుతోంది. మళ్లీ ఇన్నేళ్ల విరామం తరువాత ఈ మూవీకి సీక్వెల్ ని చేస్తున్నారు.
‘చంద్రముఖి 2’ పేరుతో రూపొందుతున్న ఈ సీక్వెల్ లో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తుండగా కీలకమైన చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ నటిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. మహిమా నంబియార్ కూడా మరో పాత్రలో మెరవబోతోంది. వడివేలు కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. గత కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.
ఫిబ్రవరి సెకండ్ వీక్ నుంచి కంగన ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది. తనతో పాటు లారెన్స్ కీలక తారాగణం పాల్గొనగా దర్శకుడు పి. వాసు కీలక ఘట్టాలని చిత్రీకరించారట. ఇదిలా వుంటే తాజా షెడ్యూల్ ని ఈ గురువారం ప్రారంభించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ రాఘవ లారెన్స్ సోషల్ మీడియా వేదికగా వడివేలు మరి కొంత మంది ఆర్టిస్ట్ లతో కలిసి వున్న ఫొటోలని అభిమానులతో పంచుకున్నాడు. వడివేలుతో కలిసి లారెన్స్ కామెడీ చేస్తూ ఇచ్చిన పోజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా వుంటే చంద్రముఖి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది జ్యోతిక నటన. మరి సీక్వెల్ లో ఆ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ మళ్లీ జ్యోతిక మ్యాజిక్ ని రిపీట్ చేసి తనని మరిపిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి పద్మశ్రీ తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.