సినీ పరిశ్రమలో ఇలా వచ్చి అలా స్టార్ రేంజ్ కి వెళ్లే వాళ్లు కొందరైతే టాలెంట్ ఉన్నా కూడా ఇంకా లక్ కలిసి రాని వారు కొందరు ఉంటారు. అలాంటి వారిలో యాక్టర్ సత్యదేవ్ ఒకరు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన అతను లీడ్ రోల్ చేసే స్థాయికి ఎదిగాడు. అయితే తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవడంలో వెనకపడుతున్నాడు సత్యదేవ్. అంతకుముందు సైడ్ రోల్స్ చేస్తూ వచ్చిన సత్యదేవ్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన జ్యోతిలక్ష్మి సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో లీడ్ రోల్ గా ఫస్ట్ స్టెప్ వేశాడు సత్యదేవ్.
ఆ తర్వాత స్టార్ సినిమాల్లో చేస్తూ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే సరైన పబ్లిసిటీ లేకనో లేక కంటెంట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం వల్లనో కానీ సత్యదేవ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వట్లేదు. అయినా సరే అతని ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు. సత్యదేవ్ చేసిన బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు, స్కై ల్యాబ్ ఇవన్ని కొత్త కంటెంట్ తో వచ్చిన సినిమాలే. థియేట్రికల్ రిలీజ్ నుంచి వెళ్లాక ఎక్కడో ఓటీటీలోనో స్మాల్ స్క్రీన్ మీదో చూసి సత్యదేవ్ మంచి అటెంప్ట్ చేశాడని అనుకుంటున్నారు.
టాలెంట్ ఉన్నా కూడా సత్యదేవ్ ఖాతాలో ఒక సరైన సినిమా పడట్లేదని చెప్పొచ్చు. రెండేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవితో గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సత్యదేవ్ తమన్నా తో కలిసి గుర్తుందా శీతాకాలం లాంటి లవ్ స్టోరీ చేసినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈసారి కృష్ణమ్మ అంటూ పీరియాడికల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా మే లో రిలీజ్ అవుతుంది. సినిమా నుంచి వచ్చిన టీజర్ మరోసారి సత్యదేవ్ టేస్ట్ ని తెలియచేస్తుంది.
మరి ఈ కృష్ణమ్మ అయినా సత్యదేవ్ ఖాతాలో ఒక సూపర్ హిట్ పడేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. కొత్తదనంతో వచ్చే సినిమాలను ఆదరించే తెలుగు ఆడియన్స్ తెలుగు హీరో సత్యదేవ్ చేస్తున్న ప్రయత్నాలను మాత్రం పట్టించుకోవట్లేదు. అయితే ఈసారి టార్గెట్ మిస్ అవ్వకూడదని సత్యదేవ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తున్నాడని తెలుస్తుంది. కృష్ణమ్మతో పాటుగా ఫుల్ బాటిల్, జీబ్రా, గరుడ సినిమాల్లో నటిస్తున్నాడు సత్యదేవ్. యువ హీరోల్లో కొత్త ప్రయత్నాలతో ప్రేక్షకులను మెప్పించాలనుకునే వారిలో సత్యదేవ్ ఒకరు. సో ఈ హీరో కూడా హిట్ ట్రాక్ ఎక్కితే ఆడియన్స్ కు మరిన్ని కొత్త కథలు చెప్పే సాహసం చేస్తాడని చెప్పొచ్చు.