అతడు భారతదేశంలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉన్న స్టార్. 80వయసులోను ఇంకా నవయువకుడిలానే నటనను కొనసాగిస్తున్నారు. యువహీరోలు సైతం ఆశ్చర్యపోయేలా, తనను అనుసరించేలా గొప్ప ఛరిష్మాను కలిగి ఉన్న ఆయన బుల్లితెరపైనా హోస్టింగ్ లో రారాజుగా ముద్ర వేసారు. అతడు పడి లేచిన కెరటం. ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక బుల్లితెర రియాలిటీ షో హోస్ట్ గా మొదలై, మళ్లీ పోగొట్టుకున్న చోటే రాబట్టుకున్న ఘనాపాటి. భారతీయ సినిమా ముఖచిత్రంపై అతడి పేరుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
అయితే ఇప్పుడు అలాంటి స్టార్ కుటుంబంలో ఆస్తి పంపకాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అంబానీల కుటుంబంలో కుదుపులా కాకుండా ఈ పంపకం ఎంతో డీసెంట్ గా కొనసాగుతోందని బాలీవుడ్ మీడియా గుసగుసలాడుతోంది. అంతేకాదు సూపర్ స్టార్ తన 3000 కోట్ల ఆస్తుల్ని విభజించి కొడుకు, కూతురు ఇద్దరికీ సమానంగా పంచేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎవరా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే.. మరెవరో కాదు.. ది గ్రేట్ అమితాబ్ బచ్చన్. బిగ్ బిగా సుప్రసిద్ధులు.
అమితాబ్ బచ్చన్ తన ఆస్తిని వారసులు అభిషేక్ – శ్వేత ఇద్దరికీ 3,160 కోట్ల ఆస్తుల్ని పంచనున్నారని సమాచారం. తన ఆస్తుల్ని కేవలం కుమారుడు అభిషేక్‌కు మాత్రమే ఇవ్వనని, కుమార్తెకు ఆస్తిలో సమాన వాటా ఇస్తున్నానని అమితాబ్ గతంలో ప్రకటించారు. ఐకానిక్ జుహు బంగ్లా ప్రతీక్ష ఇటీవల తన కుమార్తె శ్వేతా నందకు బహుమతిగా ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ తన మొత్తం ఆస్తిని అభిషేక్ -శ్వేత మధ్య సమానంగా పంచుకోవాలని తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశాడు. ఇద్దరు పిల్లలూ తమ తండ్రి నికర ఆస్తి విలువ నుండి దాదాపు రూ.1600 కోట్లను అందుకుంటారని విశ్లేషిస్తున్నారు.
అభిషేక్ ప్రస్తుత నికర ఆస్తుల విలువ రూ.280 కోట్లు.. 564 శాతం వృద్ధి చెంది రూ.1860 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అదేవిధంగా శ్వేతా బచ్చన్-నందా ప్రస్తుత నికర ఆస్తి విలువ రూ.110 కోట్లు. 60-కోట్ల బంగ్లా మినహా, మొత్తం రూ.1690 కోట్లతో 1436 శాతం గణనీయమైన పెరుగుదలను చేరుకోవచ్చని అంచనా. మాజీ విశ్వసుందరి, ప్రస్తుతం బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్.. శ్వేత కంటే 590 శాతం ఎక్కువ నికర ఆస్తుల విలువను కలిగి ఉండగా.. తన వాటాను అందుకున్న తర్వాత, ఆమె నికర విలువ ఐశ్వర్యారాయ్ తో పోలిస్తే 104 శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. అదనంగా అభిషేక్ బచ్చన్ నికర ఆస్తి విలువ అతని భార్యతో పోలిస్తే 124 శాతం పెరుగుతుంది.
బచ్చన్ ఫ్యామిలీలో ఆస్తుల పంపకాలకు సంబంధించిన అధికారిక సమాచారం ఏదీ బయటకు తెలియదు. ఈ ప్రాసెస్ అంతా చాలా హుందాగా సాగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత విషయాలపై గౌరవప్రదమైన మౌనం పాటిస్తున్న బచ్చన్ కుటుంబం ఈ వారసత్వ పంపిణీ ని గోప్యంగా ఉంచింది.
అమితాబ్ బచ్చన్ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇప్పటికీ యువకులతో పోటీపడుతూ ఆయన ఎంతో ఎనర్జిటిక్ గా పని చేస్తున్నారు. ప్రభాస్ `కల్కి 2898 AD`, `తలైవర్ 170`లో కనిపించబోతున్నారు. అలాగే ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ల సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ అమితాబ్ తన స్నేహానికి సిసలైన నిర్వచనాన్ని ఇస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్లతో అమితాబ్ నటిస్తుండడం ఆసక్తికరం.