మళ్ళీ 27 ఏళ్ళ తరువాత ఆ రొమాంటిక్ జోడి

సినిమా ఇండస్ట్రీలో కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో హీరోయిన్స్ ఒకప్పుడు కంటిన్యూగా సినిమాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. కానీ గత 20 ఏళ్ళ నుంచి ఆ తరహా కాంబినేషన్స్ కనిపించడం లేదు. ఇక కొన్నిసార్లు ఓకే సినిమాతో మెప్పించిన హీరో హీరోయిన్ మళ్ళీ కనిపిస్తే చూడాలని ఆడియెన్స్ కోరుకుంటూ ఉంటారు.

ఇక అలా కోరుకునే లిస్టులో మెరుపు కలలు జోడి టాప్ లిస్ట్ లో ఉంటుందని చెప్పవచ్చు. ఆ సినిమాలో వెన్నెలవే.. పాటను ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. అలాంటి కాంబినేషన్ మళ్ళీ ఇన్నాళ్ళకు బిగ్ స్క్రీన్ పై సరికొత్తగా కనిపించబోతోంది. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి బాలీవుడ్‌లో తన ప్రతిభను చాటేందుకు సిద్దమయ్యాడు. తన కొత్త యాక్షన్ థ్రిల్లర్‌లో బాలీవుడ్‌ స్టార్‌లు కాజోల్, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

27 సంవత్సరాల క్రితం మెరుపు కలలు సినిమాలో కలిసి నటించిన ఈ జంట మళ్లీ తెరపై కనిపించనుంది. ఇక ఈ ప్రాజెక్టులో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఉన్నారు. కాజోల్, ప్రభుదేవా కాంబినేషన్ ప్రేక్షకులకు మరింత ఉత్సాహం కలిగించనుంది. ఈ ప్రాజెక్టు తొలి షెడ్యూల్ పూర్తయి, త్వరలోనే టీజర్ విడుదల చేయనున్నారు.

ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌లో టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన జికె విష్ణు, యానిమల్ మూవీకి సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్, పుష్ప చిత్రానికి ఎడిటర్‌గా పని చేసిన నవీన్ నూలి వంటి ప్రతిభావంతులు ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. స్క్రీన్ ప్లే కోసం మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో క్రేజ్ అందుకున్న నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా పనిచేస్తున్నారు.

ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ వ్యవహరిస్తున్నారు. ఇక ప్రభుదేవా, కాజోల్ కలయికతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు మునుపెన్నడూ లేనివిధంగా వినోదాన్ని అందించనుంది. ప్యాన్ ఇండియా భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి, చరణ్ తేజ్ ఉప్పలపాటి బీటౌన్‌లో తన ప్రతిభను నిరూపించడానికి భారీ ప్రాజెక్టుతో ముందుకు రావడం నిజంగా ప్రత్యేకంగా ఉంది. తెరమీద కనిపించడం తగ్గించిన నసీరుద్దీన్ షా కూడా ఈ ప్రాజెక్టులో భాగమవడం కథకు బలమైన కంటెంట్ ఉన్నట్టు సూచిస్తుంది.