మహేష్ – నితిన్ లతో రొమాన్స్ చేయనున్న స్టార్ హీరోయిన్..?

‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన పూజా హెగ్డే.. ‘డీజే’ ‘మహర్షి’ వంటి పెద్ద సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోలకు ఏకైక ఛాయిస్ గా మారిపోయిన పూజా.. గతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి వరుస అవకాశాలు అందుకుంటోంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ – డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో ‘సర్కస్’.. అలానే స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఓ సినిమా చేస్తోంది పూజా.

ఇప్పుడు విజయ్ హీరోగా నటిస్తున్న ‘బీస్ట్’ చిత్రంతో కోలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇలా మూడు భాషల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న పూజా హెగ్డే.. డిమాండ్ కు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి రూ.3.5 కోట్ల వరకు వసూలు చేస్తోందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగులో ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్న బుట్టబొమ్మ పూజాహెగ్డే.. మరో సినిమాని ఓకే చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

నితిన్ హీరోగా నటించబోయే అప్ కమింగ్ సినిమాలో అమ్మడినే హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారట. ‘నా పేరు సూర్య’ డైరెక్టర్ వక్కంత వంశీ తో నితిన్ ఓ చేయనున్న సంగతి తెలిసిందే. యూత్ స్టార్ హోమ్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రంలోనే పూజా హీరోయిన్ గా నటించనుందట. ‘మాస్ట్రో’ షూటింగ్ ని పూర్తి చేసిన యువ హీరో.. త్వరలోనే వక్కంత వంశీ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. దీని తర్వాత ఎస్ ఆర్ శేఖర్ డైరెక్షన్ లో కృతి శెట్టి తో కలిసి నితిన్ ఓ మూవీ చేయనున్నాడు.

కాగా పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘రాధే శ్యామ్’.. అఖిల్ అక్కినేని సరసన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కనిపించనుంది. నితిన్ సినిమాతో పాటుగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి కూడా పూజా సైన్ చేసినట్లు టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘#SSMB28’ చిత్రంలో బుట్టబొమ్మ నే హీరోయిన్ గా ఫైనలైజ్ చేసారట. ఏదేమైనా పూజా లైనప్ చూస్తుంటే ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు అమ్మడి హవా నే కొనసాగుతుందని చెప్పవచ్చు.