సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పన్నెండేళ్ల క్రితమే వీరి కలయికలో చర్చలు జరగ్గా.. ఇన్నాళ్లకు క్రేజీ కాంబోలో ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చుతున్నందుకు ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయనున్నట్లు జక్కన్న ప్రకటించిన రోజు నుంచే దీనిపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. దీనికి తోడు ఇదొక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని.. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని రాజమౌళి మరింత హైప్ ఎక్కించారు.
గత రెండు నెలలుగా తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరియు కజిన్స్ తో కలిసి స్క్రిప్టు మీద పని చేస్తున్నారని రాజమౌళి ఇటీవల తెలిపారు. ‘ఇండియానా జోన్స్’ వంటి హాలీవుడ్ సినిమాల తరహాలో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ అడ్వెంచర్ మూవీ ఉంటుందని పేర్కొన్నారు.
అయితే రాజమౌళి SSMB29 లో మహేష్ బాబును ఎలాంటి సరికొత్త అవతార్ లో ఆవిష్కరిస్తారనేదే ఇప్పుడు చర్చనీయంగా మారింది. దర్శకుడు తన సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా హీరోల లుక్ ని సెట్ చేస్తారు. దీని కోసం చాలా మేకోవర్ అవ్వాల్సి ఉంటుంది. శారీరకంగా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది.
‘యమదొంగ’ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంతగా శ్రమించాడో మనం చూసాం. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ మరియు రానా దగ్గుబాటి.. RRR కోసం రామ్ చరణ్ మరియు తారక్ ఫిజికల్ గా ఎంతగానో కష్టపడ్డారు. ఇప్పుడు SSMB29 కోసం మహేష్ బాబు సైతం కొత్తగా మేకోవర్ అవుతాడని భావించవచ్చు.
మహేష్ ఇటీవల కాలంలో అన్నీ సాఫ్ట్ రోల్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా లుక్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 కోసం మహేష్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా మాస్ అవతార్ లోకి మారిపోయాడు.
ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ చేయబోయేది జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ మూవీ కాబట్టి.. రఫ్ గా రగ్గుడ్ లుక్ నే ఎక్సపెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ సూపర్ స్టార్ గడ్డం – మీసాలు మరియు లాంగ్ హెయిర్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది కనుక.. ఇంకాస్త మేకోవర్ అయ్యే అవకాశం ఉంది.
‘బాహుబలి’ ఫ్రాంచైజీతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన దర్శకుడు.. RRR చిత్రంతో అంతర్జాతీయ ప్రశంసలు అందనుకున్నారు. ఈ సినిమా గురించి ఇండియాలో కంటే మించి వెస్ట్రర్న్ కంట్రీస్ లో ఎక్కువ చర్చ జరిగింది.
‘ఆర్.ఆర్.ఆర్’ ను ఆస్కార్ అవార్డ్స్ బరిలో నిలపడానికి జరిగిన క్యాంపెయిన్ తో జక్కన్న గురించి హాలీవుడ్ లో మాట్లాడుకున్నారు. గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తర్వాత దర్శకుడి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అందరూ వేచి చూస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరి ఈ క్రేజీ చిత్రం ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.