మ‌హేష్‌-రాజ‌మౌళి సినిమాలో హ‌నుమంతుడు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయకుడిగా రాజ‌మౌళి తెర‌కెక్కించ‌నున్న భారీ పాన్ ఇండియా చిత్రం కాస్టింగ్ గురించిన‌ వివ‌రాలు స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ మాలీవుడ్ స‌హా ప‌లు ప‌రిశ్ర‌మ‌ల నుంచి న‌టీన‌టుల‌ను రాజ‌మౌళి ఎంపిక చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌ల‌యాళీ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తార‌ని గుస‌గుస‌లు వినిపించాయి.

ఇంత‌లోనే ఆదిపురుష్ లో న‌టించిన దేవదత్తా నాగే రాజ‌మౌళిని క‌లుసుకోవ‌డంతో అస‌లేం జ‌రుగుతోంది? అన్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. ఓం రౌత్-దర్శకత్వం వ‌హించిన ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా నటించిన దేవదత్తా నాగే ఇటీవల హైదరాబాద్‌లో ఎస్ఎస్ రాజమౌళిని కలిశారు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మీటింగుకి సంబంఢంచిన‌ ఫోటోల‌ను షేర్ చేసారు. అనంత‌రం మహేష్ బాబుతో SSMB 29 లో అతడు న‌టిస్తున్నాడంటూ ప్ర‌చారం సాగిపోతోంది.

దేవదత్తా దర్శకుడు రాజ‌మౌళితో క‌లిసి ఉన్న ఫోటో వైర‌ల్ గా మారుతోంది. ఈ ఫోటో చాలా సందేహాల‌కు తావిచ్చింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ ఫోటో తీసాడు. “లెజెండరీ డైరెక్టర్‌తో చెరిషబుల్ మూమెంట్ ..సర్ శ్రీ ఎస్.ఎస్ రాజమౌళి గారూ.. ఇలాంటి ఆహ్లాదకరమైన ఫోటోని తీసినందుకు ప్రతిభావంతుడు.. వినయశీలి.. సింపుల్ హ్యూమన్ బీయింగ్ అయిన శ్రీ కార్తికేయ గారూ ధన్యవాదాలు.. అని రాసాడు. అయితే దేవదత్తా తాను రాజ‌మౌళిని ఎందుకు క‌లిసాడో మాత్రం వివరించలేదు.

ఎక్స్ ఖాతాలో అభిమానుల స్పంద‌న‌లు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. “దేవదత్తా నాగే గొప్ప మరాఠీ నటుడు… మీరు అతడి నటనను చూడాలనుకుంటే మరాఠీ సీరియల్ జై మల్హర్ చూడండి… అతడు ఆదిపురుష్‌లో వృధా అయ్యాడు. దేవ‌ద‌త్తా రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఉన్నందుకు సంతోషంగా ఉంది“ అని ఒక అభిమాని రాసారు. అయితే రాజ‌మౌళి సినిమాలో అవ‌కాశం నిజ‌మా? అంటూ కొంద‌రు సందేహం వ్యక్తం చేశారు.

ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌కి కాస్టింగ్ డైరెక్టర్‌గా వీరేన్ స్వామిని తీసుకున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ నిర్మాతలు, శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత‌లు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. “ప్రముఖ మీడియా (టైమ్స్ ఆఫ్ ఇండియా) ఎస్ఎస్ రాజమౌళి – మహేష్ బాబు ప్రాజెక్ట్ నటీనటుల ఎంపికకు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించినట్లు మా దృష్టికి వచ్చింది. కథనంలో మిస్టర్ వీరేన్ స్వామి మా సినిమాలోని ఏ భాగానికీ ఏ విధంగానూ ప్రమేయం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము.

అవసరమైనప్పుడు అన్ని అధికారిక ప్రకటనలను ప్రొడక్షన్ హౌస్ చేస్తుంది“ అని రాసారు. ఇంకా పేరు పెట్టని SSMB 29 త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. భారీ విజ‌యం సాధించిన RRR తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియానా జోన్స్ తరహాలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.