‘యానిమల్‌’ మేకర్‌, నాని మధ్య ఇంట్రెస్టింగ్‌ స్టోరీ..!

బాలీవుడ్ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌ హీరోగా తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందిచిన యానిమల్‌ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లు మార్క్ కి కూత వేటు దూరంలో యానిమల్ సినిమా ఉన్న విషయం తెల్సిందే. ఒక వైపు యానిమల్ ఆ రేంజ్ లో దూసుకు పోతూ ఉంటే మరో వైపు హాయ్‌ నాన్న సినిమా తో నాని కూడా బాక్సాఫీస్ వద్ద కుమ్మేస్తున్నాడు.

యానిమల్‌ సినిమా తో పోటీ పడుతూ మరీ నాని ‘హాయ్‌ నాన్న’ సినిమా వసూళ్లు నమోదు చేసుకుంటూ ఉంది. ఈ సమయంలో నాని గురించి యానిమల్ దర్శకుడు సందీప్ వంగ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యానిమల్‌ సినిమా విడుదల తర్వాత ప్రమోషన్‌ కార్యక్రమాలను దర్శకుడు సందీప్ వంగ కంటిన్యూ చేస్తున్నాడు.

తాజాగా యానిమల్‌ విజయం పై దర్శకుడు సందీప్ వంగ మాట్లాడుతూ నాని గురించి కూడా స్పందించాడు. తాను దర్శకుడిగా పరిచయం అవ్వక ముందు ఒక లవ్ స్టోరీ ని రాసుకున్నాను. ఆ కథ నానికి సెట్‌ అవుతుందని భావించి ఆయన్ను కలిసేందుకు చాలా ప్రయత్నించాను. ఒక హోటల్ లో నాని ఉన్నాడని తెలిసి స్నేహితుడి ద్వారా కలిసేందుకు వెళ్లాను.

హోటల్ లో పర్సనల్‌ కార్యక్రమంలో ఉన్న నానిని ఆ సమయంలో కలిసి కథ చెప్తాను అంటే విసుక్కుంటాడేమో అని భయపడి ఆ రోజు కథ చెప్పలేదు. ఆ తర్వాత ఎప్పుడు కూడా నానితో ఆ కథ చెప్పేందుకు ఛాన్స్ రాలేదు. ఇంతలో అర్జున్‌ రెడ్డి మొదలు అయిందని సందీప్ వంగ చెప్పుకొచ్చాడు.

హాయ్ నాన్న సినిమా ప్రమోషన్‌ లో నాని మాట్లాడుతూ యానిమల్‌ లాంటి సినిమా కథ వస్తే తప్పకుండా నటిస్తాను. అంతకు మించి వైల్డ్‌ పాత్రలో అయినా నటిస్తాను అన్నట్లుగా నాని చెప్పుకొచ్చాడు. నాని ఆ మాటలతో సందీప్ రెడ్డి వంగ భవిష్యత్తులో అయినా నానితో సినిమాకు ప్లాన్‌ చేస్తాడేమో చూడాలి.