యుద్ధం చేస్తు ఉక్రెయిన్ జనాలనే కాదు సొంత దేశం రష్యాలోని జనాలను కూడా వ్లాదిమర్ పుతిన్ వణికించేస్తున్నారు. పుతిన్ దెబ్బకు ఉక్రెయిన్ జనాలు వణికిపోతున్నారంటే అర్ధముంది. మరి ఏ కారణంగా సొంత జనాలు కూడా వణికిపోతున్నారు.
ఎందుకంటే ఉక్రెయిన్ తో యుద్ధం చేయటానికి సరిపడా సైన్యం లేదట. దాదాపు ఏడు నెలలుగా సా…..గుతున్న యుద్ధంలో వేలాదిమంది రష్యా సైనికులు చనిపోయారు. దాంతో యుద్ధం చేయటానికి రష్యాకు సైన్యం కొరత వచ్చిందట.
అందుకనే 18-35 ఏళ్ళ మధ్య వయస్సు యువతను అవసరం వచ్చినపుడు యుద్ధరంగంలోకి దూకటానికి సిద్ధంగా ఉండాలని పుతిన్ ఆదేశించారు. దాంతో జనాలంతా ఆ అవసరం ఎప్పుడొస్తోందో తెలీక భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళందరికీ సిద్ధంగా ఉండమని నోటీసులు అందాయట. రిటైర్డ్ సైనికులందరినీ అవసరమైన మెడికల్ టెస్టులన్నీ చేయించుకుని తమకు రిపోర్టులు పంపాలని ఆదేశాలు అందాయి.
ఒకవైపు సరైన వ్యూహం లేకుండానే యుద్ధానికి దిగిన పుతిన్ కారణంగానే వేలాదిమంది సైనికులు చనిపోయారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దాంతో యుద్ధంలోకి వెళ్ళటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. వీలైనంత తొందరగా రష్యాను వదిలేసి పొరుగుదేశాలకు పారిపోవాలని జనాలంతా ప్లాన్ చేస్తున్నారు. పొరుగు దేశాలైన అర్మేనియా జార్జియా అజర్ బైజాన్ ఖజకిస్ధాన్ రుమేనియా దేశాలకు జనాలు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఈ దేశాలకు వెళ్ళే విమానాలన్నీ నిముషాల్లో ఫుల్లయిపోతున్నాయి.
ఈ విషయాన్ని గమనించిన వెంటనే ప్రభుత్వం 18-65 ఏళ్ళ మధ్యలో ఉండే మగవాళ్ళని విమానాల్లో ఎక్కించుకోవద్దని ఆదేశించింది. మగవాళ్ళు ప్రభుత్వానికి తెలీకుండా ఎట్టి పరిస్ధితుల్లోను దేశం వదిలి వెళ్ళేందుకు లేదని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వం ఆదేశాల దెబ్బకు విమాన సంస్థలు మగవాళ్ళకు టికెట్లను అమ్మటం ఎక్కించుకోవటం మానేశాయి. దాంతో ఆడవాళ్ళంతా నానా గోల చేస్తున్నారు. ఎవరెంత గోలపెట్టినా పుతిన్ మాత్రం ఎవరినీ పట్టించుకోవటంలేదు. చివరకు రష్యాలో ప్రజల తిరుగుబాటు లేదా అంతర్యుద్ధం తప్పదేమో అనేట్లున్నాయి పరిస్ధితులు.