యంగ్ హీరో రాజ్ తరుణ్ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నుంచి చివరిగా వచ్చిన అనుభవించు రాజా స్టాండప్ రాహుల్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో ఈయన ఇప్పుడు ఓటీటీ బాట పట్టారు. తమడ మీడియా మరియు జీ5 సంయుక్తంగా నిర్మించబోయే ఓ వెబ్ సీరీస్ లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్నాడు.
‘ఆహ నా పెళ్ళంట’ టైటిల్‌తో ఈ సిరీస్‌ను రూపొందిస్తుండగా.. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాజ్ తరుణ్ సరసన సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ మెరవబోతోంది. నటి ఆమని హర్షవర్ధన్ పోసాని కృష్ణమురళి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇటీవలె రాజమండ్రిలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ సిరీస్ ప్రారంభం అయింది.
ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ జరుగుతోంది. రాహుల్ తమడ సాయి దీప్ రెడ్డి బుర్ర నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ 30 నిమిషాల నిడివి తో ఎనిమిది ఎపిసోడ్ లుగా జీ5లో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సిరీస్ కాన్సెప్ట్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది.
ఎన్నో ఏళ్లుగా ఓ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కనే ఓ యువకుడు(రాజ్ తరుణ్) ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కుతాడు.
కానీ తాళి కట్టే సమయానికి రాజ్ తరుణ్ కలలపై నీళ్లు జల్లి పెళ్లి కూతురు(శివాని) తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోతుంది. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన రాజ్ తరుణ్.. శివాని ఆమె బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి..? అన్న కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సరికొత్త ప్రేమ కథ అని.. అందరినీ అలరించేలా ఈ సిరీస్ ఉంటుందని అంటున్నారు. మరి కామెడీ డ్రామా రొమాన్స్ తో సాగే ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.